ఈ ఫొటో గుర్తుంది కదా? దాదాపు పక్షం రోజుల క్రితం ఖమ్మం జిల్లా మధిరలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ లో కొందరు ప్రభుత్వ అధికారులు మద్యం సేవిస్తున్నట్లు తెలుసుకున్న జర్నలిస్టులు ఎగబడి మరీ ఫొటోలు, వీడియోలు తీస్తున్న దృశ్యమిది. కరోనా కల్లోలంలో కనీసం సామాజిక దూరాన్ని కూడా పాటించకుండా దాదాపు పాతిక మంది విలేకరులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన వృత్తిపరమైన పోటీ ‘సిత్రమిది’. సరే ఆయా ఘటనలో విలేకరులపై అధికారి ఫిర్యాదు, అధికారులపై కొందరు పాత్రికేయుల మరో ఫిర్యాదు, పోలీసు కేసులు తదితర అంశాల్లో నిజా, నిజాలేమిటన్నది చట్టం తేలుస్తుంది. అది వేరే విషయం.
మధిర పోలీసులు అప్పట్లో వెల్లడించిన వివరాల ప్రకారం రెవెన్యూ గెస్ట్ హౌజ్ ఘటన అర్థరాత్రి ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలోనూ పాత్రికేయులు తమ డ్యూటీ నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో గెస్ట్ హౌస్ లో గల ఓ ప్రభుత్వ అధికారి మాస్కును లాగే వరకు విలేకరుల డ్యూటీ నిరాటంకంగా సాగింది. అదంతా వృత్తిలో భాగమా? కాదా? అనే అంశాలను వదిలేద్దాం. ఇక్కడ ఈ సీన్ కట్ చేద్దాం.
తాజాగా బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ భారీ లిక్కర్ దందా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ కు చెందిన కారులో 43 ఖరీదైన లిక్కర్ బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలు… ఖమ్మం నగరం నడిబొడ్డున గల బైపాస్ రోడ్డు ప్రధాన మార్గంలోని ఈ రెస్టారెంట్ వద్ద వెలుగు చూసిన ఘటనలో ఎక్సైజ్ అధికారులు విడుదల చేసిన ఫొటోలు మాత్రమే విలేకరులకు దిక్కు కావడం గమనార్హం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నాటకీయ ఫక్కీలో రెస్టారెంట్ లిక్కర్ దందాలో అధికారుల దాడులు జరిగాయనే ప్రచారం ఉంది.
ఈ పరిస్థితుల్లో ఘటన గురించి మీడియాకు కనీసం ఉప్పందకుండా ఓ వ్యక్తి దళారిగా వ్యవహరించినట్లు కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. రెస్టారెంట్ లిక్కర్ బాగోతంలో భిన్న కథనాలు సైతం గురువారం వాడుకలోకి వచ్చాయి. ఘటనా స్థలి నుంచి పారిపోతూ గాయాలపాలై ఆసుపత్రుల్లో కొందరు ముఖ్యులు చికిత్స తీసుకుంటున్నారనేది ఆయా కథనాల సారాంశం. కొందరు ప్రజాప్రతినిధులు, మరికొందరు ముఖ్యులు ఘటనా స్థలంలో ఉన్నట్లు కూడా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం సంఘటనను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నించిన ఆ ‘బ్రోకర్’ ఎవరు? ఇదీ ఖమ్మం మీడియాలో చర్చనీయాంశంగా మారిన అసలు ప్రశ్న.