కరోనా కల్లోలపు శిక్ష ఇది. పగవాడికి కూడా ఎదురుకావద్దని కోరుకునే పరాభవమిది. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మహాప్రభో అంటూ మొర పెట్టుకుంటున్న ఆక్రందన ఇది. పన్నెండెకరాల ఆసామిని… నా ఇంట్లో నన్ను ఉండనివ్వరా? అని దీనంగా వేడుకుంటున్న దృశ్యమిది. ఊరి బయటకు గెంటేసిన వైనంపై బాధితుల ఆవేదన ఇది. కరోనా కల్లోలపు బహిష్కరణ ఉదంతమిది. అవమాన భారంతో మామిడితోటలో రెండు పరదాల మధ్య… చిమ్మ చీకట్లో, దోమల బెడద, పాముల భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకీడుస్తున్న ఇద్దరు వ్యక్తుల వ్యధ ఇది. అమానవీయ ఘటన పూర్వాపరాలు బాధితుల మాటల్లోనే…
ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చింతల తాతారావు (40) అను నేను… నాతో పాటు పల్లపు వెంకటేష్(19)ను తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలి దగ్గర వడ్లమూడిలో విజ్ఞాన్ యూనివర్సిటీలో మార్చి 17 నుండి 32 రోజులు పాటు పెయింటింగ్ పని చేశాము. లాక్ డౌన్ మూలంగా ఏప్రిల్ 27 అర్ధరాత్రి రైలు పట్టాలవెంట బయలుదేరి రోజంతా నడిచి డైరెక్ట్ గా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ 28న అన్ని పరీక్షలు చేయించుకున్నాము. ఇంట్లోనే 15 రోజులు ఉండాలన్న వైద్యాధికారుల ఆదేశంతో చేతిమీద కోవిడ్-19 ముద్ర వేయించుకుని ఆటో ద్వారా ఇంటికి 2:30pm వెళ్ళాము. గంటపాటు 3:30pm వరకు ఇంట్లోనే ఉన్నాము. ఇద్దరు గ్రామ ఆశావర్కర్లు, గ్రామ సెక్రెటరీ లక్ష్మీ ప్రసన్న, సర్పంచ్ భర్త నూతలపాటి వెంకటేశ్వర్లు కలసి మా ఇంటికి వచ్చి, గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు… మీరు ఊరిలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఓట్లకోసం పదే పదే దండం పెడుతూ తిరిగిన సర్పంచ్ కూడా కనీసం గ్రామ ప్రజలకు అవగాహన పర్చకుండా, అవమానకరంగా మమ్ములను ఊరవతల మామిడి తోటలో పరదాలు కట్టుకుని ఉండమన్నారు.
కానీ ఇక్కడ మాకు తాగడానికి నీళ్లు దొరకడం లేదు, రాత్రిపూట కరెంటు లేదు, విపరీతమైన దోమలు, పాముల భయంతో చచ్చి బతుకుతున్నాము. పశువులు కాసుకునేవారు కూడా మమ్ములను చూసి దూరంగా పోతున్నారు. గంటపాటు మా ఇంట్లో ఉన్నందుకు మా అమ్మను అవమానంగా వీధుల్లో తిరగొద్దని వెల్లగొడుతున్నారు. నేను పన్నెండకరాల ఆసామిని. మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వడం లేదు. పాలు కూడా పోయడం లేదు. ఈ మధ్యనే మొక్కజొన్న పంట 150 క్వింటాలు… క్వింటాకు 1,600 రూపాయల చొప్పున అమ్మాను. ఇంకా ఎకరం పంట అలాగే ఉంది. కోయడానికి ఎవరూ రావడంలేదు. రోజు రోజుకీ అవమానం తట్టుకోలేక పోతున్నాము. చచ్చిపోవాలనిపిస్తోంది. అధికారులు స్పందించి మా ఇంట్లో మేము ఉండే విధంగా మాకు న్యాయం చేయాలని చేతులెత్తి మొక్కుతున్నాము.’’ అని వారు వివరించారు.
కాగా ఈ ఘటనపై అనంతసాగర్ గ్రామ సర్పంచ్ మంగతాయమ్మ భర్త నూతలపాటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా, తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కావాలంటే విచారణ చేసుకోవచ్చన్నారు. అయితే గ్రామంలోని వారి ఇంట్లో వసతులు లేవని, అందువల్లే వారిద్దరు గ్రామం బయట ఉన్నారని సర్పంచ్ మంగతాయమ్మ పేర్కొనడం గమనార్హం.
update:
ఈ వార్తా కథనం ts29లో ప్రచురితమైన నేపథ్యంలోనే అధికారులు అత్యంత వేగంగా స్పందించి బాధితులను వారి ఇంటికి పంపించడం విశేషం.