‘నకరాల్ చేస్తున్నవా? … బాంబు పెట్టి లేబట్టేస్తా… నీ పోలీస్ స్టేషన్నే లేబట్టి పడేస్తా… నా తడాఖా ఏందో చూపిస్తా…నీ ఎస్పీని పిలుస్తవా? డీఎస్పీని పిలుస్తవా? ఎవరనుకుంటున్నావ్? ఏమనుకుంటున్నావ్?’ అంటూ పోలీసులపై ఓ వ్యక్తి పక్కా సినీ ‘డైలాగ్’లతో ప్రతాపం చూపించాడు. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఓ వ్యక్తి చేసిన దాదాగిరి పోలీసుల సహనానికి పరీక్షగా నిలిచిందనే చెప్పాలి. అకారణంగా బయటకు బైక్ పై వచ్చిన ఓ వ్యక్తిని టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జి చెక్ పోస్టు వద్ద పోలీసులు నిలువరించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పోలీసులపై బూతులంకించుకున్నాడు. చాలాసేపటి వరకు ఈ వ్యక్తి ప్రవర్తనపై పోలీసులు సహనంతో వ్యవహరించారు. చివరికి పోలీసు వాహనాన్ని రప్పించి అతన్ని తీసుకువెళ్లారు. అనంతరం అతని గురించి ఆరా తీయగా ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లు సమాచారం.
ఏడాది క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి ఈ వ్యక్తి మతి స్థిమితం లేని విధంగా వ్యవహరిస్తున్నాడని, లాక్ డౌన్ వల్ల మద్యం లభించక ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుని ఇటీవలే డిశ్చార్జి అయినట్లు పోలీసుల విచారణలో తేలిందట. దీంతో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణలో ఆయా అంశాలు తేలేవరకు ‘నానా యాగీ’ చేసిన ఈ వ్యక్తి ఎవరబ్బా అనుకుంటూ పోలీసులు తలలు నిమురుకున్నారట. తనను అడ్డుకున్న పోలీసుల పట్ల ఆ వ్యక్తి ఎలా వ్యవహరించాడో దిగువన గల వీడియోలో చూడండి.
గమనిక: వీడియోలో అక్కడక్కడా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఉంది. పిల్లలు చూడకుండా ఉంటే మంచిది.