ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆశీర్వాదం కోసం నడుం వంచిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కూడా తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎమ్మే. పేరు డాక్టర్ తాటికొండ రాజయ్య. ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కూడా. అయితే ఏంటీ అనే ప్రశ్నకు కడియం అనుయాయులు, అనుచరులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకూ అంటే…
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల తాజా రాజకీయ పంచాయతీ తెలిసిందే కదా? ఎమ్మెల్యే అనుమతి లేకుండా మంత్రి సహా ఎవరూ తన నియోజకవర్గంలో అడుగిడవద్దని, ఖబడ్దార్ అంటూ రాజయ్య హెచ్చరించగా, చేతనైతే పేదలకు సహాయం చేయాలి… లేదంటే ఆదుకునేవారిని చూసి చప్పట్లు కొట్టాలి అంటూ శ్రీహరి కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే. ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంల పాత పంచాయతీ గురించి చెప్పాలంటే పే…ద్ద గ్రంథమే అవుతుంది. కాస్త క్లుప్తంగా చెబితే మాత్రం ఇద్దరి రాజకీయ కేంద్రం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గమే. శ్రీహరి టీడీపీలో, రాజయ్య కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి రాజకీయ వైరం ఉంది. కానీ ఇద్దరూ గులాబీ జెండా కప్పుకున్న తర్వాతే కొత్త పంచాయతీ మొదలైంది.
టీఆర్ఎస్ లో చేరిన తర్వాత శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిందీ లేదు. గెలిచిందీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే శ్రీహరికి ఇక్కడ పోటీ చేసే ఛాన్సే దక్కలేదు. వాస్తవానికి స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్ లక్ష్యంగానే ఆయన టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రచారం ఉంది. కానీ శ్రీహరి ఒకటి తలిస్తే…గులాబీ బాస్ కేసీఆర్ మరోరకంగా దయ తలిచారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా మాత్రమే శ్రీహరికి అవకాశం ఇచ్చారు. ఏవేవో ఆరోపణల నేపథ్యంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని లాగేసి శ్రీహరి చేతుల్లో పెట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మళ్లీ రాజయ్యకే ఘన్పూర్ టికెట్ దక్కింది. దీంతో శ్రీహరి అనుయాయులు పెద్దఎత్తున హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. శ్రీహరి అనుచరగణం బలప్రదర్శనతో కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆయా సందర్భంగా శ్రీహరి ఆశీస్సులు కోరుతూ రాజయ్య ఇలా ఫొటోలో చిక్కారు. తన గెలుపునకు సహకరించాలని శ్రీహరిని అప్పట్లో రాజయ్య ఈ విధంగా అభ్యర్థించారు.
రాజయ్య తనకు తమ్ముడు లాంటివాడని, అతన్ని గెలిపించాలని శ్రీహరి ఘన్పూర్ నియోజకవర్గ ఓటర్లను ప్రచారపర్వంలో అభ్యర్థించారు. మొత్తానికి రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కరోనా నేపథ్యంలో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ వలస కూలీలకు, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో రాజయ్యకు చిర్రెత్తుకొస్తోందట. ఏదో ముందస్తు రాజకీయ ప్లాన్ తోనే శ్రీహరి తన నియోజకవర్గంలో సుడిగాలిగా తిరుగుతున్నారని ఆయన అభద్రతా భావానికి గురవుతున్నారట. అందుకే తన అనుమతి లేకుండా ఎవరూ రావద్దని రాజయ్య హుంకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు పరస్పర పరోక్ష హెచ్చరికలకు, విమర్శలకు దిగుతున్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇక్కడే శ్రీహరి అనుచరులు, అనుయాయులు గుర్రుమంటున్నారుట. ‘అప్పుడేమో దండం పెట్టి కాళ్లు మొక్కుతారు…ఎక్కెక్కి…వంగి వంగి ఏడుస్తారు..మీ స్వార్థం కోసం? ఇప్పుడేమో నా పర్మిషన్ కావాలి అంటున్నారా?’ అనే వ్యాఖ్యలతో ఆయా ఫొటోను ట్యాగ్ చేస్తూ ‘ట్రోలింగ్’కు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటో హాట్ టాపిక్. అదీ సంగతి.