‘భక్తి ముదిరి పిచ్చి పీక్ స్టేజి’కి చేరడం అంటే ఇదే కాబోలు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధకునిగా, స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫల దాతగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. గులాబీ పార్టీని స్థాపించి 19 సంవత్సరాలు ముగిసి 20వ వసంతంలోకి నేడు అడుగిడిన శుభసందర్భం. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కానీ కొందరు నాయకులు, కార్యకర్తలు ఏం చేస్తున్నారో తెలుసా? పైత్యం పరాకాష్టకు చేరిన చందంగా పార్టీ సృష్టికర్త విషయంలో విచిత్రంగా వ్యవహరిస్తుండడం గమనార్హం . తెలంగాణా ప్రజల కలలను సాకారం చేస్తున్న కేసీఆర్ పట్ల కొందరు నేతలకు, కార్యకర్తలకు భక్తి భావం మరీ ముదిరి పాకాన పడినట్లుంది. అందుకే కాబోలు అమంగళ పనులకు పాల్పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
విషయాన్ని రాయడానికి తెలంగాణా బిడ్డగా కంప్యూటర్ కీ బోర్డుపై వేళ్ళు కూడా ముందుకు కదలడం లేదు. కానీ జర్నలిస్టుగా జరిగిన ఘటనలను నివేదించడం అనివార్యం కదా? పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకడేమో కేసీఆర్ ఫోటో ముందు కొబ్బరి కాయలు కొట్టి, అగర్ వత్తులు ముట్టించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొకడెమో టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో పక్కనే కేసీఆర్ ఫోటో కూడా ఏర్పాటు చేసి ఈ ఇద్దరు నేతల ఫొటోలకు దండ వేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఫీర్జాదిగూడలో జరిగిందట. ఇవీ టీఆర్ఎస్ ఆవిర్భావం రోజున వెలుగు చూసిన రెండు ఘటనలు.
హే… తెలంగాణా బాపూ… మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, మీ నాయకత్వంలో తెలంగాణా మరింత పురోగమించాలని నినదించాల్సిన చోట ఇటువంటి ఘటనలు సమర్థనీయమా? మిమ్నల్ని దేవునిగా భావిస్తూ ఇలా చేశామని నిర్వాహకులు బదులిస్తారేమోా? పిచ్చి ముదిరి పైత్యం పరాకాష్టకు చేరిన ఇటువంటి పార్టీ భక్తులను కంట్రోల్ చేయడానికి కాస్త మీరే బెత్తం అందుకోక తప్పదేమో!