తెలంగాణా సమాజం, ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రంలోని పత్రికా పాఠకలోకం ఎంతో సంతోషించాల్సిన అంశమిది. తెలంగాణా అభివృద్ధి సోపానానికి ఆంధ్రా బేస్డ్ పత్రికలు ‘జయహో’ అంటున్న అద్భుత ఘట్టమిది. అత్యధిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికెట్ గల ఈనాడు నుంచి సాక్షి వరకు తెలంగాణా రథ సారథుల పాలనను అద్భుతమనే అంశాన్ని వివరిస్తూ కీర్తిస్తున్న అనూహ్య పరిణామమిది. కారణాలు ఏవైనా కావచ్చు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో పాలన తీరును దాదాపుగా ఒకే శీర్షికన కీర్తిస్తూ ఇంటర్వ్యూలు ప్రచురిస్తున్న తీరు ఒకింత ఆశ్చర్యం. ఇంకో రకంగా సంబురం కూడా. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన ఉద్యమ నేత ప్రస్థానానికి ఆంధ్రాకు చెందిన మెయిన్ స్ట్రీమ్ మీడియా జేజేలు పలుకుతున్న అరుదైన ఘటన ఇటీవలి కాలంలో కొత్తేమీ కాకపోవచ్చు. కానీ గమనించాల్సిన అంశమేమిటంటే…?
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున దాదాపు తెలుగు ప్రధాన పత్రికలన్నీ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూను ప్రముఖంగా ప్రచురించాయి. జర్నలిజంలో సందర్భానుసార ఇంటర్వ్యూలు పత్రికలకు సహజమే. అందులో భాగమే కేటీఆర్ తాజా ఇంటర్వ్యూ. టీఆర్ఎస్ అధికార పత్రికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ఇంటర్వ్యూ తరహాలోనే ఈనాడు, సాక్షి పత్రికల ఇంటర్వ్యూ సాగడం విశేషం. ‘జల దృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా…’ అనే శీర్షికలే దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కనిపించడం గమానార్హం. ఈనాడు మాత్రం ఆయా శీర్షికను కాస్త కుదించి ‘సుజల దృశ్యం’ అని ముగించడం విశేషం.
ఒకప్పుడు తెలంగాణా వార్తలంటేనే అసహనం ప్రదర్శించినట్లు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కున్న ఆంధ్రా మూలాల పత్రికల్లో ఒకే హెడింగ్, ఒకే సారాంశంతో కేటీఆర్ ఇంటర్వ్యూ ప్రచురితం కావడం సంతోషకర పరిణామంగా అభివర్ణించక తప్పదు. శీర్షికలే కాదు ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని పరిశీలనగా చదివితే ప్రశ్నలు, జవాబుల సారాంశం కూడా ఒకే విధంగా ఉండడం తెలుగు పత్రికా రంగంలో గమ్మత్తు పరిణామమే. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ఈనాడు వంటి పత్రిక క్రియేటివిటీ ప్రామాణికంగా ఇంటర్వ్యూలు చేస్తుంటుంది. ఈసారి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ప్రజలనే కాదు.. పత్రికా రంగాన్ని సైతం ఒకే బాటన పయనింపజేసే విధంగా పాలన సాగడం నిజంగా అభినందించాల్సిన అంశమే. అందుకే టీఆర్ఎస్ ఆవిర్భావ దినం సందర్భంగా జయహో కేసీఆర్… జయహో కేటీఆర్… జయ జయహే తెలంగాణా!