నిత్యం లక్షలాది మంది వేంకటేశ్వరస్వామి భక్తులు సంచరించిన చోట… గోవిందా నామస్మరణ మార్మోగిన ప్రాంతంలో… ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొంటే…? కరోనా కల్లోల పరిస్థితుల్లో కలియుగ దేవుని తిరుమల కొండలు ఎలా కనిపిస్తున్నాయి? ఏవేని కొత్త దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయా? ఆ… ఏముంటుంది? అంతా నిర్మానుష్యం.. ఆ మధ్య ఘాట్ రోడ్లపై జింకలు పరుగెత్తున సీన్ కాబోలు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇప్పుడీ సీన్లు తాజాగా కనిపించినవి. తిరుమల కొండల్లో చడీ చప్పుడు లేని నిశ్శబ్ధ వాతావరణం వన్యప్రాణులకు ఎక్కడా లేని స్వేచ్ఛకు హేతువైంది.
చిరుత పులులు, ఎలుగు బంట్లు, దుప్పులు, జింకలు, పడగెత్తిన సర్పరాజులు. తిరుమల కొండ మీది రోడ్లపై స్వేచ్ఛా జీవులుగా తిరుగుతున్న దృశ్యాలివి. తిరుమల కొండల్లోని ఘాట్ రోడ్లలోని అడవుల్లో కాదండోయ్… శ్రీవారు కొలువై ఉన్నచోటే… కరోనా ‘లాక్ డౌన్’కు ముందు నిత్యం భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లోనే ప్రస్తుతం అనేక అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే కలియుగ వైకుంఠం కాస్తా… ఇప్పుడు వన్యప్రాణి స్వేచ్ఛా విహార ప్రదేశంగా మారిందనడంలో అతిశయోక్తి లేకపోవచ్చు. అందుకు సాక్ష్యంగా దిగువన గల వీడియోను తిలకించండి.