మనిషి బుద్ధి జీవి అంటుంటారు. కానీ స్వార్ధ జీవి కూడా అనే విషయం అనేక సందర్భాల్లో, సంఘటనల్లో రుజువైంది. ప్రాణం పోయే పరిస్థితులు, పరిణామాలు ఏర్పడినపుడు మనిషి స్వార్థగుణాన్ని వీడుతాడనే భావనను కొందరు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఆయా భావన నిజం కాదనే దృశ్యాలు తాజాగా కనిపిస్తుండడమే విశేషం. కల్లోల కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ మనిషి బ్లాక్ మార్కెట్ దందాను విడనాడడం లేదు. ఒకడేమో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి దొడ్డిదారిన మద్యం నిల్వలను విక్రయిస్తుంటాడు. మరొకడేమో కూరగాయల లోడు కింద గుట్కా బస్తాలు తీసుకువస్తాడు. ఇంకొకడేమో మానవీయ సేవ అంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. తాజాగా చోటు చేసుకున్న పలు ఘటనలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.
ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ లో గల ఆర్కే బార్ యజమాని సమీపంలోని తన ఆఫీసులో అక్రమంగా మద్యం నిల్వలను విక్రయిస్తుండగా ఈనెల 9వ తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 74 వేల రూపాయల విలువైన మద్యం నిల్వలను స్వాధీనం చేసుకుని శరత్, రవిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
మరో ఘటనలో నిత్యావసర సరుకుల రవాణా ముసుగులో నిషేధిత మత్తు పదార్థాలను రవాణా చేస్తుండగా ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాలీ ఫ్లవర్ కూరగాయల లోడుతో గల వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. కాలీ ఫ్లవర్ నిల్వల కింద రూ. 6.37 లక్షల విలువైన నిషేధిత గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పనామా చౌరాస్తా వద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ భారీ స్థాయిలో రవాణా చేస్తున్న మద్యం నిల్వలను తాజాగా పట్టుకున్నారు. అంతకు ముందు ఇదే రాజధాని నగరంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఖరీదైన కారులో దర్జాగా మద్యం నిల్వలను రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఇక లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిరాశ్రయులైన నిరుపేదలకు అన్నదానం పేరుతో ముందు బ్యానర్లు కట్టుకుని, వెనుకవైపు భారీ వాహనాల టైర్లను రవాణా చేస్తున్న వాహనాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ప్రాణాంతక కరోనా వైరస్ సైతం మనిషి స్వార్ధబుద్ధిని ఏమాత్రం మార్చడం లేదు… అక్రమ మార్గాల్లో సంపాదన యోచనను కట్టడి చేయడం లేదు. అందుకే ‘మనీ’ ఛీ.. ఛీఛీ… అనాల్సి వస్తోంది.