‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే… సూర్లో చుట్ట కాలిందని ఇంకొకడు ఏడ్చిన’ చందంగా ఉంది కార్పొరేట్ విద్యా సంస్థల పని.
కరోనా వైరస్ తో ప్రపంచమే అతలా కుతలం అవుతుంటే, తమ దాకా రాలేదన్నట్లుగా కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తుండడమే విచిత్రం.
కరోనా వైరస్ ను బ్రేక్ చేసే పనిలో ప్రభుత్వం, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు నిమగ్నమై ఉండగా, సందట్లో సడేమియా లాగా ఇదే అదునుగా భావించి అడ్మిషన్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాలు.
వాయిదా పడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సబ్జెక్టులకే ఆన్ లైన్ తరగతులకు దిక్కులేదు. కానీ కార్పొరేట్ విద్యా సంస్థల వారు ఒకటవ తరగతి నుంచే అన్ లైన్ తరగతులను నిర్వహిస్తుండడం గమనార్హం. పేరుకే ఆన్ లైన్ తరగతులు. కానీ ఆ పేరుతో ఫీజులు అడగడం, కొత్త అడ్మిషన్ల గురించి కాంపెయిన్ చేయడం… ఇదీ జరుగుతున్న అసలు తంతు.
ఈ విద్యా సంవత్సరంలో నెల రోజుల కాలాన్ని విద్యార్థులు నష్ట పోయారు. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. తప్పని సరిగా జరగాల్సిన పరీక్షలు చాలా ఉన్నాయి. ‘వీటన్నింటితో మాకు సంబంధం లేదు. మాకు తెలిసిందల్లా విద్యా వ్యాపారమే’ చందంగా వ్యవహరిస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. కరోనా వైరస్ కంటే ముందు నుంచే ఉన్న ఈ కార్పొరేట్ విద్యా వ్యాపారంలో, ఈ కరోనా తమకో లెక్క కాదంటున్నట్లు యాజమాన్యాలు వ్యవహరించడమే అసలు విశేషం.
కార్పొరేట్ విద్యా సంస్థల ఆకర్షణీయమైన ప్రచారాన్ని నమ్మిన తల్లి తండ్రులు ఆర్థికంగానేగాక మానసికంగానూ నష్టపోతున్నారు. నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. తమ స్తోమతకు తగ్గట్టుగా చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలని అనుకున్న మధ్య తరగతి తల్లి తండ్రులకు అవకాశం దక్కకుండా పోతోంది.
డబ్బు ఉన్నోళ్ళకే డబ్బు ఆశ ఎక్కువ అన్నట్లు, ఈ కరోనా వైరస్ విజృంభణలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ఉంటే, అడ్మిషన్ల కోసం కార్పొరేట్ విద్యా సంస్థల అడ్డదారి దందాలేమిటన్నదే పలువురి ప్రశ్న.
కాగా ఇంతకాలం టీవీ చర్చా వేదికలకు వచ్చే మేధావులు చెప్పేది, ప్రతి ఒక్క తల్లి తండ్రుల్లో ఉన్న అభిప్రాయం ఒక్కటే. నేటి తరం పిల్లలు చెడిపోవడానికి సగం కారణం స్మార్ట్ ఫోన్లు అని ఇంత కాలం నొక్కి చెప్పారు. నేడు అదే మేధావులు టీవీ ఛానెల్ చర్చల్లో ఈ సమయంలో చిన్న పిల్లలకు ఆన్ లైన్ తరగతులు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రస్తుతం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ చర్చల్లో పాల్గొనేది కూడా కార్పొరేట్ విద్యా సంస్థల ప్రతినిధులే అనేది వేరే విషయం. అదే తల్లి తండ్రులు నేడు తమ చిన్న పిల్లలకు తామే స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. దీనినే పూర్వం పెద్దలు కలికాలం అనేవారట. తాను నమ్మినోడు నోట్లో కారం పోసినా తియ్యగానే ఉంటుందట. కానోడు అనుకుంటే అదే నోట్లో చక్కెర పోసినా చేదుగానే ఉంటుందట.
అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా కార్పొరేట్ విద్యా సంస్థల వారు చెప్పారు కాబట్టి చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం మంచిదే అనేది వారి అభిప్రాయం కాబోలు.
✍ తుమ్మలపల్లి ప్రసాద్