కరోనా మనిషిని భయపెడుతోంది. ఇల్లు వదలి, గడప దాటి బయటకు రావద్దంటోంది. కాదని వస్తే కబలిస్తానని కరోనా మనిషిని హెచ్చరిస్తోంది… తీవ్రంగా వణికిస్తోంది కూడా. కరోనా ధాటికి ప్రపంచ వ్యాప్తంగా మానవుడు ఇళ్లకే పరిమితం కావలసిన అనివార్య స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి వన్యప్రాణులు ఎలా ఉన్నాయి? వాటికి ఇప్పుడు ఎక్కడా లేని స్వేచ్ఛా, స్వాతంత్రాలు లభించాయంటే అతిశయోక్తి కాదు.
వన్యప్రాణి సంచరించే అడవుల్లో ప్రస్తుతం మానవుని అడుగు జాడ లేదు. అటవీ మార్గాల్లో వాహనాల రణగొణ ధ్వనులు లేవు. ఇన్నాళ్లపాటు అభయారణ్యాలకే పరిమితమైన వన్యప్రాణులు కరోనా పరిణామాల్లో, ప్రశాంత వాతావరణంలో రోడ్డెక్కుతున్నాయి. తిరుమల కొండల్లో మొన్నా మధ్య ఘాట్ రోడ్లపై స్వేచ్ఛగా విహరించిన జింకలను చూశారు కదా? తిరుమల కొండల్లోనే కాదు, తెలంగాణాలోని అడవుల్లోనూ వన్యప్రాణి ఇప్పుడు మరింత స్వేచ్ఛా జీవి.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గల అడవుల్లో ఎన్నో అభయారణ్యాలు. మరెన్నో ‘కోర్’ ఏరియాలు. అభయారణ్యాల్లో, కోర్ ఏరియాల్లో మనుషులు సంచరించడం నిషిద్ధం. కనీసం పూచిక పుల్ల విరిచినా కోర్ ఏరియాలో భారీ నేరం. అభయారణ్యాల్లో, కోర్ ఏరియాల్లో నేరానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తరహాలో శిక్షలను ఎదుర్కునే వీలుంది.
అయినప్పటికీ మనిషి వన్యప్రాణులను చాటుమాటుగా వేటాడుతున్నాడు. అడవుల మీదపడి అటవీ జంతువులను ఆబగా ఆరగిస్తున్నాడు. క్రూర స్వభావ వ్యక్తుల కారణంగా ఒకప్పుడు కళ్ల ముందే కదలాడుతూ, సంచరించిన జింకలు, కుందేళ్లు, మనుబోతులు, కొండగొర్రెలు తదితర వన్యప్రాణులు అడవుల్లో దుర్భిణీ వేసి గాలించినా పెద్దగా కనిపించడం లేదు.
వేసవిలో వాగూ, వంకా ఎండిపోయిన పరిస్థితుల్లో మాత్రమే అడపా దడపా వన్యప్రాణులు అభయారణ్యాల నుంచి జనారణ్యంలోకి వచ్చి వేటగాళ్ల బారిన పడుతుంటాయి. కానీ అడవుల్లో ప్రస్తుతం ఇంకా వాగులు, వంకలు, సెలయేరులు ఎండిపోయిన దాఖలాలు లేవు. అడవుల్లో వన్యప్రాణుల దప్పికకు ఇంకా ఆపత్కాలం రాలేదు. బహుషా వచ్చే నెలలో వాటికి ఈ ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చు.
అయినప్పటికీ వన్యప్రాణులు అనేకం అభయారణ్యాలను వీడి జనారణ్యంలోని రోడ్లెక్కుతున్నాయ్. స్వేచ్ఛగా సంచరిస్తున్నాయ్. మొన్న తిరుమల కొండల్లోని ఘాట్ రోడ్లు కావచ్చు. నేడు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రధాన రహదారి కావచ్చు. ప్రస్తుతం మనిషి సంచరిస్తున్న చోటు ఒకప్పుడు తమదేనని జింకలు విహారం ద్వారా చెప్పకనే చెబుతున్నాయి.
కావాలంటే దిగువన వీడియో చూడండి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిణామాల్లో మనిషి కనిపించని రోడ్లపై ఈ జింకల పరుగుకు చూడండి. సత్తుపల్లిలోని తహశీల్దార్ కార్యాలయ సమీపంలోని మెయిన్ రోడ్డుపై జింకల విహార దృశ్యాన్ని అటుగా వెడుతున్న ద్విచక్ర వాహన దారులు చిత్రీకరించారు. కరోనా మానవున్ని కట్టడి చేస్తే, వన్యప్రాణికి స్వేచ్ఛనిచ్చినట్లు బోధపడడం లేదూ? ప్రకృతి విధ్వంసానికి పాల్పడే మనిషి లేని చోట వన్యప్రాణి స్వేచ్ఛా విహార జీవిగా కనిపిస్తోంది కదూ!