క్రమ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఒకే చోట పార్కింగ్ చేసిన ఈ ద్విచక్ర వాహనాలను చూశారుగా? వాటి పక్కనే మినీ లారీ, కొన్ని కార్లు, మరికొన్ని ఆటోలు కూడా ఉన్నాయి. విశాలమైన ప్లేస్ లో బైకులకు భలే పార్కింగ్ దొరికిందని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పార్కింగ్ చేసినట్లు కనిపిస్తున్న ఈ భారీ సంఖ్యలోని వాహనాల ‘కత’ ఏమిటంటే…
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణా పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కల్లోల పరిణామాల్లో బలాదూర్ బాబులపై మరీ జాలి చూపిస్తే ఆ తర్వాత మిగిలేది దుఃఖమే కదా? అందుకే పొద్దంతా లాక్ డౌన్, రాత్రి వేళ కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్న వేళ కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇటువంటి వారిని నిలువరించి కరోనాను కట్టడి చేసేందుకు కరీంనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు ఇవి. లాక్ డౌన్ అమలు నుంచి ఇప్పటి వరకు ఒక్క కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోనే ఈ విధంగా స్వాధీనం చేసుకున్న వాహనాల సంఖ్య ఎంతో తెలుసా? అక్షారాలా 5,204 వాహనాలు. వీటిలో బైకులు, లారీలు, కార్లు, ఆటోలు వంటి అనేక రకాల వాహనాలు ఉన్నాయి.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిచిన బైకు బాబులకే కాదు, ఇతర వాహనదారులకు కూడా కరీంనగర్ పోలీసులు భారీగానే జరిమానా వడ్డించారు. ఇంతకీ ఈ బండ్లను ఎప్పుడు తిరిగి అప్పగిస్తారనే ప్రశ్నకు వస్తే అది ఇప్పట్లో జరిగే వ్యవహారంలా కనిపించడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం వాహనాలను తిరిగి అప్పగించవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బండ్ల పరిస్థితి ఏంటి.. అంటారా? కరోనా ఎత్తివేత ముగిశాక ఖచ్చితంగా బండ్లు ఇండ్లకు కాదు నేరుగా కార్ఖానాకే వెళ్లవచ్చు. అంటే రిపేరింగ్ షెడ్ల బాట అన్నమాట. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ ముగిసే వరకు బండ్ల గతి అంతే. లాక్ డౌన్ ఎత్తివేసే సరికి ఈ బండ్ల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. బ్యాటరీ డిశ్చార్జి అయి, టైర్లలో గాలి లేకుండా కదల్లేని దుస్థితి కలగవచ్చు.
అందువల్ల అనవసరంగా రోడ్లపైకి రాకండి. వాహనాలతో జాలీ రైడ్ చేయకండి. మీ వాహనాలకు ఇలాంటి దుర్గతి పట్టించకండి అంటున్నారు తెలంగాణా పోలీసులు.