అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దినపత్రిక ‘ఈనాడు’పై విశ్వ హిందూ పరిషత్ భగ్గుమంది. కరోనా పాజిటివ్ నివేదిక వచ్చిన ఓ పేషెంట్ గురించి ఈనాడు ప్రచురించిన వార్తా కథనం ఇందుకు కారణం కావడం విశేషం. ఎటువంటి లక్షణాలు లేకుండానే ఓ పేషెంట్ కరోనా బారిన పడ్డారని, అతను ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లివచ్చాడని పేర్కూంటూ సాగిన వార్తా కథనంలో పేషెంట్ పేరు మార్చినట్లు ప్రకటిస్తూనే, మరో వర్గానికి చెందిన వ్యక్తి పేరు రాయడంపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్తా కథనంపై సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్ కు ఈనాడు తల బొప్పి కట్టిందనే చెప్పాలి.
ప్రచురించిన వార్తా కథనంపై అనూహ్య రీతిలో విరుచుకుపడిన నెటిజన్ల ధాటికి తాళలేక సంస్థాగతంగా ఇద్దరు ఉద్యోగులను బలి చేసే విధంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ వార్తా కథనం విషయంలో ఈనాడు తీరును మాత్రం విశ్వహిందూ పరిషత్ వదిలేట్లు కనిపించడం లేదు. ఓ వర్గపు ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వార్త రాసిన ఈనాడు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ పీ తెలంగాణా ప్రచార సహ ప్రముఖ్ పగుడాగుల బాలస్వామి, భజరంగ్ దళ్ ప్రాంత సహ సంయోజక్ యు. శివరాములు రాజధానిలోని సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఫిర్యాదులు ఇంకా రెండు, మూడు చోట్ల కూడా పోలీసులకు అందినట్లు సమాచారం.
అయితే వీహెచ్పీ చేసిన ఫిర్యాదుపైనగాని, నెటిజన్ల ట్రోలింగ్ కు గాని ఈనాడు యాజమాన్యం పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ‘దొంగలతో దోస్తీ’ శీర్షికన వార్తా కథనం ప్రచురించిన సందర్భంగా పోలీసు శాఖ నుంచి వచ్చిన ‘రియాక్షన్’కు బెంబేలెత్తిన ఈనాడు మొదటి పేజీలోనే దాదాపు క్షమాపణ చెప్పిన తరహాలో వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ అంశంలో మాత్రం బేఖాతర్ గా ఉండడంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పత్రికా ప్రమాణాల ప్రకారం పొరపాటనో, గ్రహపాటనో, సాంకేతిక కారణమనో చెబుతూ కనీసం విచారం కూడా వ్యక్తం చేయడం లేదన్నదే నెటిజన్లతోపాటు ఫిర్యాదు చేసిన వీహెచ్పీ ఆవేదనట. అందువల్లే ఈనాడుపై చర్యలకు పోలీసులను విహెచ్పీ ఆశ్రయించినట్లు సమాచారం.