‘తుమ్ము తమ్ముడై చెబుతుంది’ అనేది నానుడి. ఎవరైనా బయటకు వెడుతున్న సమయంలో మరెవరైనా తుమ్మితే… కాసేపు కూర్చుని, లేదా మంచినీరు తాగి ప్రయాణాన్ని సాగిస్తుండడం చూస్తుంటాం. మన మంచిని కోరే అంశానికి సంకేతంగా ‘తుమ్ము’ గురించి ‘తమ్ముడై చెబుతుంది’ అని నిర్వచిస్తుంటారు. కానీ అదే తుమ్ము గురించి కరోనా వైరస్ కల్లోల పరిస్థితులను అన్వయిస్తూ తెలంగాణా ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుమ్ము ఎంతటి ప్రమాదకరమో వివరించారు. ఎవరైనా తుమ్మితే నాడు ‘సత్యం’ అనేవారని, నేడు ‘చస్తిమి’ అంటున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అంతేకాదు కరోనా గురించి ఓ ముసలావిడ ఏమన్నారో, అగ్రరాజ్యం అమెరికాలో శవాల దిబ్బలకు కారణమేమిటో, వైద్య రంగంలో ప్రపంచంలోనే పేరుగాంచిన ఇటలీకి ప్రస్తుత దుస్థితి ఎందుకు దాపురించిందో ఆయన కూలంకషంగా వివరించారు. కరోనా కట్టడి అంశంలో మనం ‘కట్టుబాట్లు’ తప్పుతున్న తీరుపై ముప్పును గ్రహించాలని సిద్ధిపేట-ముస్తాబాద్ రహదారిపై ప్రయాణిస్తున్నవారి గురించి ప్రస్తావిస్తూ హితవు చెప్పారు. ఆయా అంశాలపై హరీష్ రావు తాజాగా చేసిన ఆసక్తికర ప్రసంగాన్ని దిగువన వీడియోలో చూడండి… వినండి.