కరోనా వైరస్ కట్టడి అంశంలో తెలంగాణా పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తనదైన ప్రత్యేక శైలిని కనబరుస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి కరోనా కట్టడికి ఆయన తీసుకుంటున్న చర్యలు కరీంనగర్ జిల్లా ప్రజల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానేమీ ఏసీ గదుల్లో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోవడమే మంత్రి గంగుల శైలిలో అసలు విశేషం. తాను మంత్రిననే దర్పాన్ని ప్రదర్శించకుండా, ఓ సాధారణ వ్యక్తి తరహాలో కరీంనగర్ వీధుల్లో నేరుగా తిరుగుతూ కరోనాపై పలు కట్టడి చర్యలు చేపడుతుండడం గమనార్హం. ఇండోనేషియా వాసుల కారణంగా కరీంనగర్ ను అంటుకున్న కరోనా కట్టడికి అధికార గణాన్ని వెంటేసుకుని మంత్రి స్వయంగా రహదారులపై సంచరిస్తూ, ఆదేశాలు జారీ చేస్తూ తీసుకుంటున్న చర్యలు సహజంగానే చర్చకు దారి తీశాయి.
పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఓవైపు ఆహార ధాన్యాల వ్యవహారాన్ని నిత్యం సమీక్షిస్తూనే, ఇంకోవైపు కరీంనగర్ ప్రజల్లో కరోనాపై చైతన్యాన్ని నింపుతున్న తీరు ఆసక్తికరం. ఇండోనేషియా వాసుల ఘటన పరిణామాల అనంతరం స్థానికంగా ఏర్పడిన పరిస్థితులను దారిలోకి తీసుకురావడానికి ఆయన నేరుగా సమస్యాత్మక ప్రాంతాల్లోనే పర్యటించి, అక్కడివారికి నచ్చజెప్పారు. ప్రజల అవసరాలను గమనించి కరీంనగర్ బస్ స్టేషన్ ను కూరగాయల మార్కెట్ గా మార్చినా, నడివీధుల్లో క్రిమి సంహారక మందులను తానే స్వయంగా పిచికారీ చేసినా గంగుల శైలిలో ప్రత్యేకతగా పలువురు అభివర్ణిస్తున్నారు. పేదలకు, వలస కూలీలకు పట్టెడన్నం అందించే విషయంలో తీసుకున్న చర్యలు సైతం ప్రశంసలను అందుకుంటున్నాయి. కరోనా కట్టడికి గ్రానైట్ అసోసియేషన్ నుంచి రూ. కోటి విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను, దాదాపు మరో కోటి వరకు విరాళాలను సేకరించి సీఎం సహాయ నిధికి అందించినట్లు వార్తలు వచ్చాయి.
ఉదయం వేళ వీధుల్లోకి వచ్చి కరోనా కట్టడికి మంత్రి గంగుల కమలాకర్ తీసుకున్న పలు చర్యలకు సంబంధించిన కొన్ని చిత్రాలను దిగువన స్లైడ్ షోలో వీక్షించవచ్చు.