ఖమ్మం నగరం… అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధి… దివ్యాంగుడైన ఓ వృద్ధుడు బతుకుదెరువు కోసం బడ్డీ కొట్టు నడుపుకుంటున్నాడు. చాక్లెట్లు, బిస్కెట్లు వంటి చిన్నా, చితకా సరుకులను అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. కరోనా లాక్ డౌన్ పరిణామాల్లోనూ ఆ వృద్ధుడు తన బడ్డీ కొట్టు తెరిచాడు. ఈ కొట్టు నడుపుకుంటే తప్ప అతని పొట్ట గడవదు. లాక్ డౌన్ గురించి బహుషా ఆ వృద్ధునికి అవగాహన కూడా ఉండి ఉండకపోవచ్చు. తెరిచిన బడ్డీ కొట్టు వద్దకు ఓ యువకుడు వెళ్లాడు. తాను పోలీసునని, లాక్ డౌన్ ఉండగా కొట్టు ఎందుకు తెరిచావని ప్రశ్నించాడు. వృద్ధుడు కంగారుపడ్డాడు. బెదిరిపోయాడు. తప్పయిందని చెప్పాడు. కనికరించి వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. వదిలే ప్రసక్తే లేదని, స్టేషన్ కు నడవాలని ఆ యువకుడు వృద్ధున్ని బెదిరించాడు. వదలాలంటే రూ 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద రూ. 5 వేలు లేవని, రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయని, బడ్డీ కొట్టు నడిస్తే తప్ప బతుకు గడవడదని బ్రతిమలాడాడు. పోలీసుగా ప్రకటించుకున్న యువకుని కాళ్లా, వేళ్లా పడ్డాడు. అయినా ఆ యువకుడు కనికరించలేదు.
‘నకరాల్ చేయకు… ఇప్పుడు ఈ రెండు వేలు ఇవ్వు. మళ్లీ రేపు వస్తా? మిగతా రూ. 3 వేలు ఇవ్వాల్సిందే. లేకుంటే బొక్కలోకి తోసి బొక్కల్ షూర, షూర జేస్త బిడ్డా… ఏమనుకుంటున్నవో… నేను పోలీస్’ అంటూ ఆ యువకుడు వృద్ధున్ని హెచ్చరించి మరీ వెళ్లిపోయాడు. దిక్కుతోచని వృద్ధుడు తెలిసినవాళ్ల ఇళ్ల దిక్కుగా వెళ్లాడు. రూ. 3 వేలు అప్పు కావాలని వాళ్లను అభ్యర్థించాడు. ఎప్పుడూ రూపాయి అప్పు అడగని ఈ వృద్ధుడు రూ. 3 వేలు అడగడమేమిటి? అని కొందరికి సందేహం కలిగింది. అప్పు దేనికి? అంత అత్యవసరం ఏమిటి? చెబితే తప్ప డబ్బు ఇవ్వబోమన్నారు. వృద్ధుడు బోరుమన్నాడు. నెత్తీ, నోరు మొత్తుకున్నాడు. మొత్తం పరిస్థితిని వివరించాడు.
వృద్ధుడి వ్యథ విన్న వారికి గుండె తరుక్కుపోయింది. పోలీసులైతే మాత్రం మరీ ఇలా చేస్తారా? వృద్ధుడనే కనికరం కూడా ఉండదా? అనుకుంటూ విషయాన్ని ఖమ్మం అర్బన్ సీఐ దృష్టికి తీసుకువెళ్లారు. వృద్ధుడిని కాపాడాలని, సహాయం చేయాలని అభ్యర్థించారు. తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే నిందితుడు పారిపోయే అవకాశం ఉందని, మిగిలిన రూ. 3 వేల కోసం ఎలాగూ వస్తాడని, మీరే కాపు కాసి, వల వేసి పట్టుకుంటే, సమీపంలోనే తాము అలర్ట్ గా ఉంటామని, రంగంలోకి దిగుతామని సీఐ భరోసా ఇచ్చారు.
అంచనాకు తగిన విధంగానే పోలీసుగా ప్రకటించుకున్న యువకుడు బడ్డీ కొట్టు వద్దకు రానే వచ్చాడు. వృద్ధుడి వద్ద మిగతా రూ. 3 వేలు తీసుకుంటుండగా స్థానికులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు రంగ్రపవేశం చేసి ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని ఏ స్టేషన్లో పనిచేస్తున్నావని ప్రశ్నించారు. తాను పోలీస్ కాదని, ఫలానా పత్రిక విలేకరినని ఆ యువకుడు వివరాలు వెల్లడించారు. పోలీసులు నిర్ఘాంతపోయారు. నిందితుని వెంట మహబూబాబాద్ కు చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి కూడా ఉన్నారట. ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ మొత్తంగా ఘటన.
ఇప్పుడు చెప్పండి. ఇటువంటి వ్యక్తులను జర్నలిస్టులే అందామా? దోపిడీ దొంగలు అందామా? ఇంకా ఏదైనా పేరు పెడదామా? లేదంటే నికార్సయిన, నీతివంతులైన జర్నలిస్టులతో నిజ నిర్ధారణ నిర్వహిద్దామా? మొన్నటికి మొన్న లాక్ డౌన్ పరిస్థితులను కారణంగా చూపి ఓ రైతును బెదిరించి రూ. 5 వేలు లాక్కునిపోతాడు ఒకడు. నేలకొండపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడైన వాడూ కూడా జర్నలిస్టేనట. అక్కడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఖమ్మం అర్బన్ పోలీసులకు చిక్కినవాడూ జర్నలిస్టేనట. ఔనూ… ఇంతకీ వీళ్లు జర్నలిస్టులేనా? నిర్ణయించండి… న్యాయం మీరే చెప్పండి.