‘బాధ్యత ఉండక్కర్లా…?’ ఇటీవల విడుదలైన మహేష్ బాబు సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఈ బాధ్యత మరీ ఎక్కువగా ఉండాలి. అందుకు విరుద్ధంగా బాధ్యత విస్మరించే ప్రజాప్రతినిధులు ఉంటే బాధల పాలయ్యేది కూడా ప్రజలే. సకల సౌకర్యాలు ఉన్న చోట ప్రజలను ఆదుకోవడం సాధారణ బాధ్యతగానే భావించవచ్చు. ఎటువంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో, కనీస రవాణా సదుపాయం లేని ప్రదేశాల్లో ప్రజలను ఆపదలో ఆదుకోవడం గురుతర బాధ్యతగా భావించక తప్పదు.
కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ పరిణామాల్లో నగరాల్లో, పట్టణాల్లో, అభివృద్ధి చెందిన గ్రామాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, ఇబ్బందులు ఉన్నచోట పరిష్కార మార్గాలు చూపడం సులువే. కానీ దిక్కూ, మొక్కూ లేని విధంగా కనీస రవాణా సదుపాయం లేకుండా, మారుమూల అటవీ ప్రాంతాల్లో బుక్కెడు బువ్వ కరువైన పరిస్థితుల్లో ఆదివాసీలు అల్లాడుతున్నారు. కరోనా కల్లోల పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ముఖ్యంగా చత్తీస్ గఢ్ నుంచి పొట్ట చేతబట్టుకుని తెలంగాణా అటవీ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గొత్తికోయల జీవితం ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మరింతగా దిగజారిందనే చెప్పాలి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని అడవుల్లో తలదాచుకున్న గొత్తికోయ జాతికి చెందిన ఆదివాసీల పొట్ట నింపే బాధ్యతను ఎమ్మెల్మే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన భుజస్కంధాలపై వేసుకోవడం విశేషం. తాడ్వాయి మండలం జలగలంచ, దేవునిగుట్ట తదితర గొత్తికోయ గూడేలకు ట్రాక్టర్ పై పయనించి మరీ అక్కడి ఆదివాసీలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు వంటి కనీస నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేయడం గమనార్హం.
ఎమ్మెల్యే అంటే ఏసీ కార్లలో తిరగడం, ఎన్నుకున్న ప్రజలను నట్టేట ముంచుతూ ఓటు వేసిన సిరాచుక్క ఆరిపోక ముందే పార్టీలు మారడం కాదని, ఆపత్కాలంలో ప్రజల పట్ల ఇలా బాధ్యతతో వ్యవహరించడమే ప్రజాప్రతినిధి కనీస ధర్మమని నిర్వచించక తప్పదు. ఈ అంశంలో సీతక్క నిజంగా అభినందనీయురాలే. కరోనా విపత్తులో గొత్తికోయలను ఆదుకునేందుకు సీతక్క అడవిలో పయనించిన ఆసక్తికర వీడియోను దిగువన వీక్షించండి.