ఏటూరునాగారం ఏజెన్సీలో కరోనా అలజడి నెలకొంది. ఇన్ని రోజులుగా నగరాలు, పట్టణాల్లోనే వెలుగు చూస్తున్న కరోనా పాజిటివ్ కేసులు అటవీ ప్రాంతాలకు సైతం విస్తరించడం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అయితే ఈ ఇద్దరు కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఈమేరకు గురువారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.
ములుగు జిల్లాలో ఇద్దరికి కోవిడ్-19 వ్యాధి సోకినట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, పస్రా గ్రామాలకు చెందిన ఒక్కొక్కరికి వ్యాధి ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ ఇద్దరికి చెందిన 26 మంది సంబంధీకులకు ఎటువంటి లక్షణాలు లేవని, పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన ఇద్దరికి కూడా ఎటువంటి లక్షణాలు కనిపించలేదని కలెక్టర్ చెప్పారు. తప్పనిసరిగా పరీక్ష చేయాల్సి ఉన్నందున, పరీక్ష చేయించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ సాధారణంగా ఉన్నారని, ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని ఆయన అన్నారు. అందరినీ తాడ్వాయి క్వారంటేన్ హోమ్ కి తరలించినట్లు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని ఇంచార్జిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
క్వారంటేన్ హోంలో వీరిని 14 రోజులు పరిశీలనలో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. క్వారంటేన్ హోమ్ లో వున్న వారికి త్రాగునీరు, భోజన, టీ సదుపాయాలు వారి రూమ్ లోనే ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. 14 రోజుల వ్యవధిలో ఎటువంటి లక్షణాలు కనిపించిన, ఏరియా ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డ్ కి తరలించనున్నట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డ్ తో పాటు ఐసీయూ సౌకర్యం, ఫిజిషియన్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఇదేకాకుండా బాధితుల ద్వితీయ పరిచయస్థులను గుర్తించే చర్యలు చేపట్టామన్నారు. గుర్తించిన వారందరినీ హోమ్ క్వారంటేన్ లో ఉంచి నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పస్రా, గోవిందరావుపేట, ఏటూరునాగారం గ్రామాల్లో మొత్తం సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించినట్లు, పారిశుశుద్ద్యం చేపట్టి, మొత్తం శానిటైజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మూడు గ్రామాల్లో వైద్య, ఆరోగ్య శాఖచే సర్వే చేపట్టనున్నట్లు, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. పరిస్థితి అంతా నియంత్రణలో ఉందని, ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇండ్లనుండి బయటకు రావద్దని సూచించారు. పరిశుభ్రతను పాటిస్తూ, ప్రభుత్వ సూచనలు, ఆదేశాలు పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ కోరారు.