వరదలు, సునామీలను సాకుగా చూపి జనం మీద పడి వసూళ్లకు తెగబడిన మీడియా సంస్థలు అనేకం. ఇందులో కొన్ని సంస్థలు వాస్తవికంగా జనహిత కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ అనేక బడా మీడియా సంస్థల అధిపతులు ఆయా నిధులను గుటకాయ స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేందుకు కొందరికి ఇటువంటి విపత్తులు కూడా ఉపకరిస్తుంటాయి. సరే పాత సంగతులు కాసేపు వదిలేద్దాం. మీడియాలో సరికొత్త వ్యాపార సంగతి గురించి తెలుసుకుందాం.
విషయంలోకి వస్తే… ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా హౌజ్ సాక్షి పత్రిక అనేక సంచలనాలకు పెట్టింది పేరు. దాని పుట్టుక నుంచి ఇప్పటి వరకు సంచలన అంశాలు అనేకం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగు మీడియాలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ అన్ని పేజీలను పంచరంగుల్లో ముద్రించి పాఠకులకు అందించిన తొలి ఘనత సాక్షికే దక్కుతుంది. పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సాక్షి పత్రిక ప్రస్తుతం మరో సంచలనానికి తెర లేపిందట. సాక్షి పత్రిక వార్షికోత్సవం హడావిడి కార్యకలాపాలు, ముఖ్యంగా యాడ్స్ సేకరణ ఈనెలతోపాటు వచ్చే నెల కూడా జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా పత్రికకు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖ వర్గాలు సొంత డబ్బుతో అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వాలన్నమాట.
రిపోర్టర్ల రక్త, మాంసాలను పిండి, పీల్చి, పిప్పి చేసి ఖజానా నింపుకోవడం వార్షికోత్సవాల పేరుతోనేకాదు… వేర్వేరు సందర్భాల్లో అనేక మీడియా సంస్థల్లో మామూలే. సాక్షి ఇందుకు అతీతమేమీ కాదు. ఇటీవలే సాక్షి పత్రికకు చెందిన ఓ విలేకరి తాను సంస్థ ఖాతాలో ఎన్ని లక్షల రూపాయలు జమ చేసిందీ పేర్కొంటూ బ్యాంక్ రశీదు కౌంటర్ ఫాయిల్ కాగితాన్ని సంస్థ సంబంధీకులకు వాట్సాప్ చేయబోయి, పొరపాటున మరొకరికి పంపించాడు. సదరు రిపోర్టర్ తాను పనిచేసే సెంటర్ నుంచి వసూలు చేసి సంస్థ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని చూస్తే కళ్లు బైర్లు కమ్మి, బేజార్ కావలసిందే. ప్రస్తుత జర్నలిజపు వ్యవస్థలో, పత్రికలో కొనసాగాలంటే విలేకరుల ఇటువంటి ఈతి బాధలు ఎన్ని చెప్పినా తక్కువే.
ఈ యాడ్స్ బాగోతంలో తాజా విశేషం ఏమిటంటే… ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ, విపత్కర పరిణామాల్లోనూ వార్షికోత్సవం పేరుతో యాడ్స్ ప్రచురిస్తే బాగోదని సాక్షి యాజమాన్యం నిర్ణయించిందట. హమ్మయ్య… సాక్షి విలేకరుల యాడ్స్ సేకరణ కష్టాలను కరోనా నిరోధించిందనే నిర్ణయానికి అప్పుడే రావలసిన అవసరం లేదు. అవే యాడ్స్ ను ఇదిగో ఇలా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను పేర్కొంటూ ప్రచురించాలని నిర్ణయించారట. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితులను సైతం పక్కా కమర్షియల్ వ్యవహారంగా మార్చిన పత్రిక మిడిల్ మేనేజ్మెంట్ పెద్దల చతురతకు మీరే సాక్షి.