కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలేమిటి? ‘లాక్ డౌన్’ అనే అస్త్రం. ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్ డౌన్ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఓ రకంగా ఇది కర్ఫ్యూ లాంటిదని, ప్రతి పౌరుడు బాధ్యతతో తమకు తాము నిర్బంధించుకుని ఇంటి నుంచి బయటకు రావద్దన్నది ప్రభుత్వ లక్ష్యం. మంగళవారం అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని, 21 రోజులపాటు ఇది అమల్లో ఉంటుందని సాక్షాత్తూ దేశ ప్రధాని వెల్లడించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ సైతం ప్రజలను ఓవైపు బుజ్జగిస్తూనే, ఇంకోవైపు హెచ్చరించారు. ఆర్మీని దింపే వరకు పరిస్థితిని తీసుకురావద్దని ప్రజలకు హితవు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడి పేరుతో అనేక పల్లెల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
నిర్బంధం అంటే ఏమిటి? ఎవరికి వారు స్వీయ నిర్బంధం చేసుకుని, ఇంట్లోనే ఉంటూ కరోనా కట్టడికి సహకరించాలన్నది ప్రభుత్వాల, పాలకుల పిలుపులోని అసలు ఉద్ధేశం. అంటే బయట కాలు పెట్టకుండా ప్రజలను ఇంట్లో ఉండమన్నారే తప్ప, గ్రామానికి, గ్రామానికి మధ్య మార్గాలను ధ్వంసం చేయడం కాదుగా? కానీ అనేక గ్రామాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలు ఇవే. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు నిర్మించడం, రోడ్లను తవ్వేస్తూ అడ్డంగా కందకాలు తీయడం, పెద్ద పెద్ద మట్టి కుప్పలు, రాళ్లు రప్పలు వేసి రాకపోకలను నియంత్రించడం వంటి దృశ్యాలు అనేకం. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసి ప్రభుత్వమే కట్టడి చేస్తోంది. ఇది చాలదన్నట్లు గ్రామాల మధ్య రోడ్డు మార్గాలను మూసేస్తున్న ఉదంతాలపై పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఆయా గ్రామాల్లో ఎవరికైనా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం పడితే? అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన వాహనాలు ఘటనా స్థలికి అత్యవసరంగా ఎలా చేరుకోవాలి? ఎవరేని గర్భిణీ పురిటి నొప్పులు పడితే పరిస్థితి ఏమిటి? వైద్య చికిత్సకు మార్గమేమిటి? మరెవరికైనా గుండెపోటు వంటి ప్రమాదం ముంచుకొస్తే 108 వంటి వాహనాలు రోడ్లు మూసేసిన గ్రామాలకు ఎలా వెళ్లాలి? ఇవీ సందేహాలు.
కరోనా వైరస్ కట్టడి అంశంలో ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం అక్కర లేదు. కానీ రోడ్లు తవ్వి, కంచెలు నిర్మిస్తున్నటువంటి చర్యలు ప్రజలకు మరిన్ని ఇబ్బందులను కలిగించరాదన్నే పలువురి అభిప్రాయం. ఇతర ప్రాంతాల వారు తమ గ్రామంలోకి రాకుండా ఉండాలంటే సరిహద్దుల్లో తాళ్లు కట్టి వంతుల వారీగా కాపలా ఉండాలని కూడా ఈ సందర్భంగా కొందరు సూచిస్తున్నారు.