తెలంగాణాలోని కరీం’నగరం’లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలోని రైతుబజార్ వద్ద నడిరోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న ఇతనిపేరు కొప్పుల వెంకటేష్. రాంనగర్ స్టీల్ షాపులో కార్మికునిగా పనిచేస్తుంటాడు. ఈరోజు ఉదయాన్నే ఇంట్లోకి కూరగాయలకోసం కశ్మీర్ గడ్డ రైతుబజార్ కు వచ్చాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో నడిరోడ్డుపైనే కుప్పకూలాడు. సాధారణంగా ఇటువంటి సమయాల్లో ఎవరైనా సహాయం చేస్తుంటారు. కానీ కరోనా వైరస్ భయంతో ఇతని వద్దకు రావడానికి ఎవరూ సాహసించలేదు. కొన ఊపిరితో సుమారు పావుగంట సేపు నడిరోడ్డుపై గిలగిల కొట్టుకుంటూ సహాయం కోసం అతను ఆర్తనాదాలు చేశాడు. కానీ ఎవరూ కనీస సహాయం చేయలేదు. గతంలోనే హార్ట్ సర్జరీ జరిగిన వెంకటేష్ ‘లోకం’ సహాయ నిరాకరణ కారణంగా చివరికి తన అసువులు కోల్పోయాడు. ఘటనానంతరం దాదాపు రెండు గంటల తర్వాత వైద్య సిబ్బంది 108 వాహనంతో వచ్చి వెంకటేష్ మృతదేహాన్ని తీసుకువెళ్లారు. రోడ్డుపై ఓ కాకి చస్తే వందలాది కాకులు గుమిగూడి మనుషుల చెవులు దద్దరిల్లేలా అరిచే దృశ్యం మనకు అనేకసార్లు కనిపిస్తుంటుంది. కానీ ఆ కాకులకు గల కనీస ‘జ్ఞానం’ ఇక్కడ లోకులకు లేకపోవడమే అసలు విషాదం. అందుకే కాబోలు ‘మాయమై పోతున్నడమ్మా… మనిషన్నవాడు’ అన్నాడు ఓ కవి.