ప్రింట్ మీడియాలో ఇది తాజా పరిణామం. తాము పత్రికల సరఫరాను నిలిపివేస్తున్నట్లు హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే యుద్ధంలో తాము సైతం భాగస్వామ్యం అవుతున్నట్లు దినపత్రికల హాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇందులో భాగంగానే మార్చి 31వ తేదీ వరకు అన్ని దినపత్రికల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల అన్ని దిపత్రికల ఏజెంట్లు పత్రికల సరఫరాను నిలిపివేయాలని కూడా కోరింది.
హాకర్స్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రింట్ మీడియాకు ఆశనిపాతంగానే చెప్పాలి. వాస్తవానికి హాకర్స్ వ్యవస్థ ప్రభావం హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ. ఒకే పత్రికకు మాత్రమే ఏజెంట్ గా నిర్దేశిత ప్రాంతంలో పత్రికను సరఫరా చేసే వ్యక్తిని ఏజెంట్ గా వ్యవహరిస్తారు. అతని కింద తన ఏజెన్సీ సామర్థ్యం మేరకు పేపర్ బాయ్స్ ఉంటారు. తాను ఏజెంట్ గా ఉన్న పత్రికను మాత్రమే బాయ్స్ ద్వారా అతను సరఫరా చేస్తుంటాడు. ఇది ఏజెంట్ల వ్యవస్థ. పత్రికల ఎడిషన్ కార్యాలయం నుంచి నేరుగా ఏజెంట్ కు పేపర్ పార్శిల్ అందుతుంది. అక్కడి నుంచి పంపిణీ మొదలవుతుంది.
కానీ హాకర్స్ వ్యవస్థ ఇందుకు విరుద్ధం. తన పరిధిలోని పాఠకుల అభిరుచి మేరకు వాళ్లు కోరిన పత్రికను సరఫరా చేయడమే హాకర్ విధి. తనకు అవసరమైన మేరకు కాపీలను ఆయా పత్రికల ఏజెంట్లను నుంచి తీసుకుని పాఠకులకు హాకర్ పంపిణీ చేస్తుంటాడు. హైదరాబాద్ నగరంలో ఈ హాకర్ల ప్రభావమే ఎక్కువ. వారినికోసారి పత్రికల బిల్లును వసూలు చేస్తుంటారన్నది వేరే విషయం. కానీ హాకర్లు పత్రిక పంపిణీకి సంబంధించి చేతులు ఎత్తేస్తే మాత్రం అనేక పత్రికలకు ఇబ్బందికర పరిస్థితి తప్పదు. భాషతో సంబంధం లేకుండా అన్ని పత్రికలపైనా దీని ప్రభావం పడుతుంది. ఒకటీ, అరా యాజమాన్యాలు హైదరాబాద్ నగరంలో తమ పత్రికా పంపిణీకి సంబంధించి సొంత వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ, అది పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఉంది.
జిల్లా కేంద్రాల్లో, ఇతర నగరాల్లో, పట్టణాల్లో హాకర్ల వ్యవస్థ అంతంత మాత్రమే. కానీ పల్లెల్లో దీని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ దాదాపు అన్ని పత్రికలకు సరఫరాదారు ఒకరే కావడం ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లోనే ఈనెల 31వ తేదీ వరకు దినపత్రికల పంపిణీని నిలిపివేస్తున్నట్లు హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. వాస్తవానికి కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో పత్రికల యాజమాన్యాలే ప్రచురణను నిలిపివేస్తాయనే ప్రచారం జరిగింది. ఇందుకు కొన్ని యాజమాన్యాలు సుముఖతను వ్యక్తం చేయలేదట. పేజీల సంఖ్యను కుదించడానికి మాత్రమే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల్లో హాకర్స్ తీసుకున్న నిర్ణయంపై పత్రికల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్నార్థకంగానే మారింది.
మరోవైపు జిల్లా ఎడిషన్లకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మరికొన్ని యాజమాన్యాలు తమ పత్రికను పాఠకుల వద్దకు తీసుకువెళ్లేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఓ ఫోన్ నెంబర్ ను కేటాయిస్తూ, దానికి మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా డిజిటల్ న్యూస్ పేపర్ ను అందిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచార పర్వాన్ని అందుకున్నాయి. కరోనా ధాటి, హాకర్స్ నిర్ణయం పరిస్థితుల్లో ‘ప్రింట్’ మీడియాకు చెందిన పత్రికల ప్రచురణ నిలిచిపోతే బహుషా అందరిదీ ఇక డిజిటల్ మార్గమే కావచ్చు. అంటే e-పేపర్ వరకే పరిమితం కావడం పత్రిక యాజమాన్యాలకు అనివార్యం అన్నమాట.