కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నగర, పట్టణ ప్రజలకన్నా పల్లె ప్రాంత ప్రజలే క్రమశిక్షణను పాటిస్తున్నారు. తమ గ్రామాల్లోకి ఇతర గ్రామాల వారెవరూ అడుగు కూడా మోపకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు. తాత్కాలికంగా గ్రామ సరిహద్దు మార్గాలను మూసేస్తూ ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఉపయోగించే బారికేడ్లను కూడా వాడుతూ సరిహద్దులను కట్టడి చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ట్రాక్టర్లను, వాటి కేజీ వీల్స్ ను, ఇతర వాహనాలను అడ్డుగా నిలుపుతున్నారు. మూసేసిన సరిహద్దుల వద్ద ఆయా గ్రామాలకు చెందిన యువకులు కాపలా కాస్తూ మరీ తమ గ్రామంలోకి రావద్దంటూ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నారు. ఈనెల 31వ తేదీ వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు మద్ధతుగా తెలంగాణా పల్లెల్లో సరిహద్దులను కట్టడి చేస్తూ మార్గాలను మూసిన చిత్రాలను దిగువన స్లైడ్ షోలో వీక్షించవచ్చు.