వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన 2430 జీవోను తొలిసారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై ప్రయోగించబోతున్నారా? ఈమేరకు ఐపీసీ 499, 500 సెక్షన్లనే వాడబోతున్నరా? ఇంకా ఏవేని సెక్షన్లను కూడా జోడిస్తారా? ఎందుకంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాతల్లోని మతపరమైన అంశాలను కూడా ప్రభుత్వం ప్రస్తావిస్తున్నది కాబట్టి.
ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించి గత నెల 30వ తేదీన జగన్ ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసిన సంగతి తెలిసేందే కదా? డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఫిబ్రవరి 20వ తేదీన జారీ చేసిన నెం. 938 ఉత్తర్వుకు కాస్త మార్పులు చేస్తూ జగన్ సర్కార్ 2430 జీవోను తీసుకువచ్చింది. ప్రభుత్వ కార్యకలాపాలపై నిరాధార, తప్పుడు వార్తా కథనాలు ప్రచురించిన లేదా ప్రసారం చేసిన పత్రికలపై, న్యూస్ ఛానళ్లపైనేగాక సోషల్ మీడియాపైనా పరువు నష్టం దాఖలు చేయాలని జగన్ సర్కార్ జీవో నెం. 2430 జారీ ద్వారా సంబంధిత విభాగాల అధికార గణాన్ని ఆదేశించింది. ఈ జీవోపై జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కె. రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ వంటి జర్నలిస్టులు సలహాదారులుగా ఉన్న ప్రభుత్వం నుంచి ఇటువంటి జీవోలు జారీ కావడమేమిటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ కేఆర్ మూర్తి, అమర్ చేసిన ప్రకటనలపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఇరవై రోజుల క్రితమే ఈ జీవోను ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి కేసు నమోదైన దాఖలాలు లేవు. కానీ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మాత్రం జీవోను తొలిసారి వేమూరి రాధాకష్ణపై ప్రయోగిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. మంత్రి సురేష్ ఇంకా ఏమన్నారంటే… ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియానికి మతపరమైన రంగు పూయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియానికి, మతానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారని, వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదివారని, వారు మతం మారారా..? అని నిలదీశారు. రెండు లక్షల మంది ఇంగ్లీష్ చదివి విదేశాలకు వెళ్ళారని, వారు మతం మారారా..? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్ గొప్ప మేలు చేస్తున్నారని, కొంతమంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మతానికి ముడి పెట్టే వారిని జాతి ఎప్పటికీ క్షమించదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు. మతం పేరుతో చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అర్థమైంది కదా? జీవో నెం. 2430ను జగన్ ప్రభుత్వం ఏబీఎన్ రాధాకృష్ణపైనే తొలిసారి ప్రయోగించబోతున్నదన్న మాట. అదీ విషయం.