గత ఏప్రిల్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ సీపీ, తెలుగుదేశం వ్యయం చేసిన ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? కేవలం రూ. 162.00 కోట్లు. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెల్లించింది అక్షరాలా రూ. 85.00 కోట్లు మాత్రమే. ఏపిలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో సగటున రెండు పార్టీలు ఖర్చు చేసింది సుమారు రూ. 92.57 లక్షలు మాత్రమే. పార్టీలవారీగా విభజిస్తే వైఎస్ఆర్సీపీ రూ. 48.57 లక్షలు, టీడీపీ రూ. 44.00 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఖర్చు చేసినట్లు లెక్క. నమ్మశక్యంగా లేదా? ప్రతి నియోజకవర్గానికి కనీసం రూ. అర కోటి కూడా ఖర్చు చేయలేదా? అంటారా? ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదికలను చూసైనా ఆయా పార్టీల ఖర్చు మొత్తాలను నమ్మక తప్పదు మరి.
పార్టీల వారీగా వివరాల్లోకి వెడితే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎన్నికల ఖర్చు రూ. 85 కోట్లు కాగా, ఇందులో రూ. 37.00 కోట్ల మొత్తాన్ని పార్టీ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ కు ఐ ప్యాక్ కింద చెల్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మరో రూ. 36 కోట్ల మొత్తాన్ని మీడియా సంస్థలకు యాడ్స్ కింద చెల్లించగా, రూ. 24.00 కోట్లు జగతి మీడియా సంస్థకు అంటే సాక్షి పత్రిక, టీవీలకు చెల్లించినట్లు వివరించారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తన ఎన్నికల ఖర్చు మొత్తం రూ. 77 కోట్లుగా నివేదికలో చూపింది. ఇందులో రూ. 49 కోట్ల మొత్తాన్ని మీడియా సంస్థలకు ప్రకటనల వ్యయం కింద చెల్లించినట్లు వివరించింది. మిగిలిన మొత్తాలను కూడా ఏ విధంగా ఖర్చు చేసిందీ ఆయా పార్టీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశాయని అనవసరంగా ఆడిపోసుకుంటారుగాని…ఈ నివేదికలు చూసి చెప్పండి…పెద్దగా ఏమీ ఖర్చు చేయలేదుగా?