‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. కానీ కరోనా వైరస్ మాత్రం ప్రస్తుతం శుభకార్యాల పాలిట శాపంగానే పరిణమించింది. స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, ఆప్తులను ఆప్యాయంగా ఆహ్వానించుకుని రంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకునేందుకే అందరూ ఇష్ట పడతారు. తమ తమ స్తోమతకు తగిన విధంగానే అనేక కుటుంబాల్లో వారి పిల్లల పెళ్లిళ్లు వైభవంగానే జరుపుతుంటారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతున్న నేపథ్యంలోనూ అనేక జంటలు ఒక్కటవుతుండడం విశేషమే. పలు ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలు జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న పరిణామాలు ఉన్నప్పటికీ, ముందే ముహూర్తం కుదుర్చుకున్న పెళ్లిళ్లు జరగక తప్పవు కదా? కానీ ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి, డబ్బు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతున్న దృశ్యాలు తాజాగా శుభకార్యాల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో బంధువులు, స్నేహితులు పెద్దగా హాజరు కాకపోవడంతో పెళ్లిళ్లు జరుగుతున్న అనేక ఫంక్షన్ హాళ్లు వెలవెలబోతున్నాయి. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన ఓ పెళ్లి వేడుక కరోనా వైరస్ ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను దిగువన వీక్షించండి.