కల్లు గీత కార్మికుల వృత్తిని నిత్యం పునర్జన్మగానే వ్యవహరిస్తుంటారు. కల్లు ప్రియుల కాంక్ష తీర్చి పొట్ట పోసుకునే గీత కార్మికులు తరచూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తుంటాం. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్లపెల్లి గ్రామంలో నూన్ సంపత్ గౌడ్ అనే గీత కార్మికుడు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న అరుదైన ఘటన ఇది.
చెట్టు ఎక్కిన సంపత్ గౌడ్ నడుముకు గల ‘ముత్తాడు’ బాగానే ఉన్నట్టుంది. కానీ కాళ్లకు గల ‘గుజి’ తెగిపోయినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది చెట్టుపైనే సంపత్ గౌడ్ పట్టు తప్పాడు. వామ్మో, వాయ్యో అంటూ ప్రాణభయంతో కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన సహచర గీత కార్మికులు మామిండ్ల బాలరాజ్ గౌడ్, తిరుపతి గౌడ్ లు అత్యంత వేగంగా స్పందించారు. ఒకరి తర్వాత మరొకరు చెట్టు ఎక్కి జారి పడిపోబోయిన సంపత్ గౌడ్ కు ధైర్యం చెబుతూ కాపాడిన తీరును దిగువన గల వీడియోలో చూడవచ్చు. తమ సహచరున్ని కాపాడుకోవడంలో బాలరాజ్, తిరుపతిల చొరవను, సమయస్ఫూర్తిని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు.