ఒకసారి పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎలా ఉంటుంది? దాని పరిణామాలు, పర్యావసనం ఏమిటి? అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లుతుందా? చెల్లదా? సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలను వ్యతిరేకిస్తూ తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులంటున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నేను దేశద్రోహినా? అని కూడా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. బేజాప్త చట్టం దేనికి? బాజాప్తాగా తీసుకువస్తే బాగుండేదని కూడా బీజేపీ తీరును ప్రశ్నిస్తూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై బీజేపీ నేతలు సహజంగానే మండిపడ్డారు. అసెంబ్లీ చేసిన తీర్మానం చిత్తు కాగితంతో సమానమని బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన రోజును బ్లాక్ డేగా భావిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ చట్టాలను గౌరవించలేని కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కూడా సంజయ్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో కేసీఆర్, బండి సంజయ్ వాద, ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంట్ చేసిన చట్టం, అసెంబ్లీ తీర్మానాల గురించి కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రత్యేక తెలంగాణా అంశం సందర్భంగా పార్లమెంట్ చేసిన చట్టం గురించి కేసీఆర్ అప్పట్లో ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడండి.