ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరి పరి విధాలుగా మారుతున్నాయి. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం అంశాలపై అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు విపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నేతలు పరస్పరం దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా? పెళ్లాల సంఖ్య, పిల్లల అంకె నుంచి మనవళ్లు, మనవరాళ్ల వరకు సాగిన విమర్శల వర్షం ప్రస్తుతం పేర్ల పలకరింపునకు పాకడం విశేషం. తమ నాయకున్ని పవన్ నాయుడు అని సంబోధించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు కార్యకర్తలు సైతం ఆక్షేపిస్తుండగా, తమ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిని ఉద్ధేశించి జగన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ పలకడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ అంశంలో మామూలు విమర్శలైతే ఫరవాలేదు కానీ…వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తుండడమే విచిత్ర పరిణామంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పేర్ల ప్రస్తావన గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మంత్రి కొడాలి నాని ఒకరి తర్వాత మరొకరు ఏ విధంగా స్పందించారో వారి మాటల్లోనే చదవండి మరి…
‘ఈ రోజున ఏది మాట్లాడుతామంటే చాలా సున్నితమైన అంశమైపోయింది. ఉదాహరణకు నేను జగన్ రెడ్డి గారు అంటే…ఆయన పేరు అది. దానికీ…ఆయన పేరును అలా మాట్లాడుతున్నపుడు వైసీపీ నాయకులు నొచ్చుకుని, నన్నుకూర్చోబెట్టి పవన్ నాయుడు అంటుంటే నాకు నిజంగా నవ్వొచ్చింది. చాలా హాస్యాస్పదంగా అనిపించింది. జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనకుండా మేం ఏమనాలి చెప్పండి? మా నాన్న మాకు పేర్లు పెట్టారు గాని, పేర్ల పక్కన కులం తాలూకు ట్యాగ్స్ తగిలించలేదు. బొత్సగారిని బొత్స అంటాం…బొత్స సత్యనారాయణగారు అంటాం మహా అయితే…ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డీ అనలేం. చంద్రబాబునాయుడుగారు అనలేం కదా? చంద్రబాబు అంటాం. ఏదన్నా ఓ ఫ్లోలో చెప్పాలనుకున్నపుడు చంద్రబాబుగారు అంటాం. అంతేగాని…మాట్లాడాలనిగాని, ఏదో గుచ్చాలని కాదు…అది పదం అంతే. జాతీయ మీడీయాలో జగన్ రెడ్డిగారిని జగన్ రెడ్డి అంటారు. నేను అదే ఉద్ధేశంతో అన్నాను. అంతేగాని…దానికి వేరే పదం తీసి పవన్ నాయుడు…పవన్ నాయుడు అంటే…నాయకులకు ఒకటే చెబుతున్నాను. ఇలాంటి ఆలోచనా విధానం తీసుకురాకండి.నాకు అటువంటి ఆలోచనా విధానం లేదు. బొత్స సత్యనారాయణను బొత్స నాయుడు అనలేం కదా? అలాంటప్పుడు వైసీపీ నాయకులు ఏం చేస్తారంటే…మీ 151 మంది కూర్చుని ఒక తీర్మానం పెట్టండి. జగన్ గారిని జగన్ రెడ్డి అనాలా? జగన్ మోహన్ రెడ్డి అనాలా? జగన్ అనాలా? ఉత్త జగన్ అనాలా? ఉత్తుత్తి జగన్ అనాలా? ఏదో ఒకటి చెప్పండి మాకు. ప్రజలకు స్పష్టత ఇవ్వండి. మిమ్మల్ని ఎలా పిలవాలో చెప్పండి? అలాగే బొత్సగారిని ఎలా పిలవాలో చెప్పండి. అంతేగాని మీరిలా భావోద్వేగాలు గాయపడేలా అంటే ఎలా? లేని పేరు మీరు నాకు ఎందుకు తగిలిస్తారు? మీరు సమిష్టిగా నిర్ణయం తీసుకుని జగన్ రెడ్డి గారిని ఎలా పిలవాలో చెప్పండి. దానికి తగ్గట్టుగా ఆయన్ని పిలుస్తాం.’ అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఇందుకు మంత్రి కొడాలి నాని ఎలా స్పందించారో కూడా చదవండి మరి…
‘మేం 151 మందితో సమావేశం పెట్టి జగన్ అని పిలవాలా? జగన్ రెడ్డి అని పిలవాలా? జగన్ మోహన్ రెడ్డి అని పిలవాలా? అని పవన్ కళ్యాణ్ కు డైరెక్షన్ ఇవ్వాలట. నువ్వు కూడా చెప్పు…మీ తల్లిదండ్రులు ఓ పేరు పెట్టారు నీకు…మీ అన్నయ్య సినిమాల్లోకి వచ్చాక ఇంకో పేరు పెట్టారు. నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు. దురభిమానులు ఇంకో పేరు పెట్టారు. వైసీపీ వాళ్లు ఒక పేరు పెట్టారు. నీకు లచ్చ పేర్లున్నాయ్. నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి..మొన్న ఓడిపోయిన, గెల్చిన అభ్యర్థులందరినీ మీటింగ్ బెట్టి నీకేం పేరు…ఏం స్టారని పెట్టాలి? పవర్ స్టారా? ఈ మధ్య కొత్తగా ఇంకో స్టారొచ్చింది. చంద్రబాబు నాయుడిగారి ఆశీస్సులతో…లేక ఆ స్టార్ పెట్టాలా? నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలా? నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా? మీటింగ్ పెట్టాను. నాకీ పేరొచ్చింది. డిసైడ్ చేశాను…అని చెప్పండి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి…నీకు బాగా దూరంగా… వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారని పిలవటం ఇబ్బందిగా ఉంటే…వైఎస్ జగన్ అని పెట్టు. మేం… జగన్ గారు అని పిలుత్తారు. జనం జగనన్నఅని పిలుత్తారు. జగన్ అంటారు. వైఎస్ జగన్ అను…లేకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అను…మధ్యలో మోహన్ తీసేసి…ఆ చివరి రెడ్డి తీసుకొచ్చి మళ్లీ దీంట్లో బెట్టి నేనేదో షార్టు కట్టుగా…జగన్ కన్నా షార్టా? జగన్ రెడ్డి? కాబట్టి జనానికేమీ తెలియదు…అమాయకులు…గొర్రెలు…నేనూ, చంద్రబాబునాయుడు ఏం చెప్తే అది ఇంటరు…మేమే పెద్ద పోటుగాళ్లం…మగాళ్లమని విర్రవీగారు. నేన్ లెగిత్తే మనిషిని గాదు…నన్ను పవన్ నాయుడని పిలిచాడు పేర్ని నానిగారు…’మంత్రీ…మధ్యలో చంద్రబాబునాయుడు గారు చెబుతాడు అంబోతుల్లాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేత్తన్నామంట..’ ఇదీ కొడాలి నాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తీరు.
ఈ మొత్తం ఎపిసోడ్ పై ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఏమన్నారంటే…‘‘పవన్ కళ్యాణ్ ను నాయుడు అంటే తప్పేమీ లేదు. కాపులను కోస్తాంధ్రాలో నాయుళ్లు అంటారు. అది చంద్రబాబునాయుడుకు సంబంధం లేదు. జగన్ రెడ్డి అన్నా తప్పు లేదు. నేషనల్ మీడియా జగన్ ను అలాగే అంటుంది మరి. వీళ్ల అభ్యంతరమేమిటో?’’