ఛత్తీస్ గఢ్ లో మరో పోలీస్ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంతెవాడ జిల్లా పొట్లి క్యాంపు వద్ద గురువారం జరిగిన ఈ ఘటన తీవ్రవాద అణచివేత కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసు బలగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాజస్థాన్ కు చెందిన రామ రామ్ స్వామి అనే ఎస్టీఎఫ్ జవాన్ తనను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు వెల్లడి కాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సరిగ్గా వారం రోజుల క్రితం నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ క్యాంపులో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. సీఏఎఫ్ భద్రతా బలగాలకు చెందిన అనిల్ యాదవ్ అనే జవాన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణ జవాన్లే కాదు రాహుల్ శర్మ వంటి ఐపీఎస్ ఉన్నతాధికారి సైతం తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని అసువులు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం కలిగించింది.
కొద్ది నెలల క్రితం… గత డిసెంబర్ 4వ తేదీన ఇదే రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా కడెనార్ క్యాంపులో రెహమాన్ ఖాన్ అనే ఐటీబీపీ పోలీస్ తన సహచరులైన ఐదుగురు జవాన్లను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నక్సలిజం అణచివేత కోసం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న పోలీసు బలగాలకు చెందిన జవాన్లు తీవ్ర ఒత్తిడి వల్లే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు గల అసలు కారణాలను అన్వేషించి, పరిష్కార చర్యలు తీసుకోవలసిన బాధ్యత పాలకులపై ఉందని, లేనిపక్షంలో జవాన్ల ఆత్మహత్యలు ఆగవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.