కొందరు ఐఏఎస్ అధికారుల విధినిర్వహణ తీరు ఆసక్తికరంగానే కాదు, ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంటుంది. ఇటువంటి పలువురు అధికారులు వివిధ సందర్భాల్లో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సామాన్య వ్యక్తిగా ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లి అసలైన ఆకస్మిక తనఖీ చేసిన సంగతి తెలిసిందే. సైకిల్ పై సవారీ చేసిన నారాయణరెడ్డి ఆసుపత్రి సిబ్బంది పనితీరును పరిశీలించి, చర్యలు తీసుకున్న ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. విధినిర్వహణలో భాగంగా కొందరు అధికారులు ఆయా విధంగా తమదైన ప్రత్యేక శైలిని చాటుకుంటుంటారు. తాజాగా కరీంనగర్ కలెక్టర్ శశాంక సైతం తనదైన పంథాలో వార్తల్లోకి రావడం విశేషం.
కరోనా వైరస్ ప్రపంచ ప్రజానీకాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా అనుమానితులు, వ్యాధిగ్రస్తులు, ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స, పుణే నివేదికల వంటి తదితర అంశాలు ప్రజల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాధిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అధికార యంత్రాంగం చెబుతూనే ఉంది. తెలంగాణాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం, మరో 88 మంది అతనితో కలవడం వంటి వార్తల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అనుమానిత రెండు కేసుల్లోనూ ‘నెగిటివ్’ రిపోర్టులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. తెలంగాణా ప్రజలకు ఇది శుభవార్తగా పేర్కొంటూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే తమకు సంతోషమని ప్రకటించారు.
కరోనా వైరస్ వార్తల వ్యాప్తి, భయాందోళన నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టర్ శశాంక గురువారం రాత్రి ‘పల్లె నిద్ర’లో పాల్గొనడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం సాధారణ వార్తే… కానీ కరోనా వైరస్ పరిణామాల్లోనూ దీన్ని నిర్వహించడమే ప్రత్యేక అంశం.
శంకరపట్నం మండలం గద్దపాకలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లెనిద్ర చేసిన కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వదంతులు నమ్మొద్దని, చైనాలోనే దీని ప్రభావం ఉందని చెప్పారు. కరోనా వ్యాధి భయాదోళనల మధ్య సైతం కలెక్టర్ ఓ పల్లెలో నిద్రించి, కరోనా గురించి ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపే వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం. కరోనా వైరస్ భయాందోళన వార్తల నేపథ్యంలో బయట సంచరించేందుకే పలువురు కంగారు పడుతుండగా, ఐఏఎస్ అధికారి శశాంక కనీసం మాస్కు కూడా ధరించకుండా చేసిన ‘పల్లెనిద్ర’ అసలైన వార్తా విశేషంగా కరీంనగర్ ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఇది నిజంగానే ప్రజల్లో ధైర్య నింపే ప్రక్రియగా పలువురు పేర్కొంటున్నారు.