ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం జగన్ స్వయంగా ప్రకటించి రూపొందించుకున్న ఫార్ములా అమలయ్యే ఆనవాళ్లు కూడా సమీప దూరంలో కనిపించడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా పెట్టిన రాజకీయ మెలిక ఇదే అంశాన్ని వెల్లడిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీల మధ్య ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో తిట్లరగడ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా? తన తిట్ల దండకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో వంశీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. అయ్యప్ప మాలలో గల తాను దుర్భాషలాడడం తప్పేనని, క్షమాపణ కోరుతున్నానని అంటూనే…మాలలో గల తనను రాజేంద్రప్రసాద్ తిట్టవచ్చా? అని నిలదీశారు. ఈ సందర్భంగా ఓవైపు చంద్రబాబుపై, మరోవైపు లోకేష్ పై వంశీ చేసిన వ్యాఖ్యల దాడి సంగతి ఎలా ఉన్నప్పటికీ, అసలు ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా ఎప్పడు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి వంశీ సాంకేతికంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ గత నెల 27వ తేదీన చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే వంశీ ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఇరవై రోజులు దాటినా సాంకేతికంగా తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపిన దాఖలాలు లేకపోవడం విశేషం. గడచిన 20 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం వంశీ చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. సిగ్గుంటే రాజీనామా చేయాలని లోకేష్ తన గురించి వ్యాఖ్యలు చేశారని, ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని వంశీ డిమాండ్ చేశారు. అంతేకాదు…తనను రాజీనామా కోరే ముందు బీజేపీలోకి జంప్ చేసిన నలుగురు రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించాలని కూడా వంశీ మెలిక పెట్టడం గమనార్హం. ఈ విషయంలో ఢిల్లీ వెళ్లి ప్రధాన నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇళ్ల ముందు ధర్నా చేద్దామని, తాను కూడా వస్తానని, చంద్రబాబు విమానం టికెట్ల ఖర్చు కూడా తానే భరిస్తానని వంశీ పేర్కొన్నారు. ‘నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పానా? నన్ను చేర్చుకుంటానని సీఎం జగన్ చెప్పారా?’ అని కూడా వంశీ ఎదురు ప్రశ్నించారు. అర్థమవుతోంది కదా…? వంశీ మెలిక? ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోరని రాజకీయ పరిశీలక వర్గాలు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అంటారా? అక్కడే ఉంది అసలు రసవత్తర రాజకీయం అంటున్నారు పరిశీలకులు. వారి అంచనా ప్రకారం..
వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరు…సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సరసనే, అవసరమైతే చంద్రబాబు పక్కనే కూర్చోవచ్చు. జగన్ ప్రభుత్వానికి బాహాటపు మద్ధతు ప్రకటించిన వంశీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగానికి అడుగడుగునా అడ్డు కూడా తగలవచ్చు. ఇందుకు మరో పది, పన్నెండు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గళం కలపవచ్చు. అంటే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు జగన్ సర్కార్ కు మద్ధతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సీన్ ను ఊహించవచ్చు. జగన్ కు, ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చుట్టూ వలయంలా కూర్చోవచ్చు. టీడీఎల్పీ నేత ప్రసంగానికి అదే పనిగా అడ్డు తగలనూ వచ్చు. డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ తరహా రాజకీయ సన్నివేశాలు ఆవిష్కతమైనా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల అంచనా. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోయినా వారికి పనులు చక చకా జరుగుతాయి…మహా అయితే మంత్రి పదవులు లభించకపోవచ్చు. ఎందుకంటే జగన్ ఫార్ములా ప్రకారం వంశీ వంటి టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం లేదు కదా? తాను వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు చెప్పానా? జగన్ చెప్పారా? అని వంశీ నిన్ననే కదా ప్రశ్నించింది. పార్టీలో చేరలేదు కాబట్టి వంశీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించవచ్చు. ముందు రాజ్యసభ సభ్యుల సంగతి తేల్చండి…అంటూ వంశీ తన మెలికను మరింతగా తిప్పనూ వచ్చు. అందుకే… జర…ఇంతెజార్ కరో భాయ్…సామ్నే హై ఏపీ కా పాలిటిక్స్ మజా.