పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం ఇల్లెందు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కు లక్ష రూపాయల జరిమానా విధించారు.
కేటీఆర్ రాక సందర్భాన్ని పురస్కరించుకుని ఇల్లెందులో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇల్లెందు పట్టణంలో ఒక చివరన హెలికాప్టర్ లో దిగిన కేటీఆర్ మరో చివరన ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు కారులో వచ్చారు. పట్టణం మొత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన కేటీఆర్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం చేసే మంచి పనులు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ, ఫ్లెక్సీలు పెట్టి కాదంటూ, ఫ్లెక్సీల ఏర్పాటును నివారించాలంటే అది ఇక్కడ నుంచే ప్రారంభం కావాలన్నారు. మున్సిపల్ చైర్మన్ కే జరిమానా విధించానంటే మరొకరు ఏర్పాటు చేయరని, తప్పు చేస్తే ఎవరికైనా జరిమానా విధిస్తారని గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
ఇల్లెందులో మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం లోనూ, ఆదివారం నాటి కేటీఆర్ సభ విజయవంతానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కి లక్ష రూపాయల జరిమానా విధించడం పట్ల ఆయన అభిమానులు ఒకింత నొచ్చుకున్నారన్నది వేరే విషయం.
✍ తుమ్మలపల్లి ప్రసాద్