పాము, కప్ప, కుక్క, నక్క, గబ్బిలం, కోతి, కొండముచ్చు కాదేదీ చైనీయుల ఆహారానికి అనర్హం. ఆ మధ్య చైనాలోని ఓ నాన్ వెజ్ మార్కెట్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే కదా? ఓ భారీ కొండ చిలువను పేద్ద కత్తితో ఖండ ఖండాలుగా నరుకుతూ విక్రయిస్తున్న సీన్ చూస్తే కడుపులో దేవినట్లయింది. కుక్కల, పందుల తలకాయలు, కాళ్లు, మొండెం వంటి అనేక జంతువులను మాంసపు మార్కెట్లో విక్రయానికి ఉంచిన వీడియో చూసినవారిని కలవరపర్చింది. సరే ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ మేడిన్ చైన్ కరోనా వ్యాధికి ఇటువంటి జంతువులను, వన్యప్రాణులను తెగ తింటుండడమే మూల కారణమనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే వివిధ రకాల జంతువులు, వన్యప్రాణులు చైనీయులను ఎలా భయపెడుతున్నాయో, వాటి ధాటికి అక్కడి ప్రజలు భయకంపితులై కరోనా వైరస్ పంజరంలో చిక్కుకున్న తీరును ఓ కార్టూనిస్టు కళ్లకు కట్టినట్లు గీసిన వ్యంగ్య చిత్రం కూడా ఆకట్టుకుంది. తడిస్తేగాని గుడిసె కప్పరనే సామెతను నిజం చేస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. దేశంలో వన్యప్రాణి విక్రయాన్నే కాదు, భక్షణపైనా నిషేధం విధించింది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చైనా అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆదేశిచిందట. ఈ విషయాన్ని చైనా అధికారికి టీవీ ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి చైనాలో వన్యప్రాణులను కరోనా (కొవిడ్-19) ఇలా బతికించిందన్నమాట. లాంగ్ లివ్ వైల్డ్ లైఫ్ (వన్యప్రాణులు వర్ధిల్లాలి) అందామా మరి!