ధనసరి అనసూయ అలియాస్ సీతక్క…ఎవరో తెలుసుగా? ములుగు ఎమ్మెల్యే. ఆదివాసీ ఆడపడుచు. ములుగు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ నక్సలైట్ లీడర్. ఔను… సీతక్క పూర్వ కాలంలో ఓ సాయుధ దళానికి నాయకత్వం వహించారు. అజ్ఞాత జీవితంలో అడవుల్లో తుపాకీ పట్టుకుని సాయుధ దళాన్ని ముందుకు నడిపించి విప్లవ కార్యకలాపాలు నిర్వహించిన సీతక్క తుపాకీ పట్టుకుంటే ఎలా ఉండేవారు? అప్పట్లో ఆమె తుపాకీ పట్టుకుని తిరిగిన ఫొటోలు బహిర్గతమైన దాఖలాలు తక్కువే. కానీ ప్రస్తుతం ఆమె చట్ట సభలో ప్రజాప్రతినిధి.
సాయుధ నక్సలైట్ జీవితం గడిపిన కాలంలో సమ్కక్క-సారలమ్మ తల్లుల దర్శనం కోసం తాను ఎలా వచ్చేవారో సీతక్క ఇటీవల జరిగిన మేడారం జాతర సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. పోలీసుల ముందు నుంచే తాను వన దేవతల దర్శనానికి వెళ్లేదాన్నని సీతక్క స్పష్టం చేశారు. కానీ సీతక్క తుపాకీ పట్టుకుంటే ఎలా ఉంటారనే విషయమూ ఆసక్తికరమే కదా! ఇదిగో ఇలా ఉంటారు. ఏటూరునాగారంలో జరుగుతున్న గిరిజన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతక్క ఇలా తుపాకీతో గురి చూస్తూ కనిపించారు. రైఫిల్ షూటింగ్ పోటీల సందర్భంగా సీతక్క తుపాకీ పట్టుకున్న దృశ్యమిది. కాకపోతే ఆలీవ్ గ్రీన్ దుస్తులు మాత్రమే లేవు. మిగతాదంతా సేమ్ టూ సేమ్… అంటే అడవుల్లో తుపాకీ పట్టుకుని తిరిగిన సందర్భాల్లో సీతక్క ఇలాగే ఉండేవారన్న మాట. అదీ విషయం.