ఔను… ఈనాడు పత్రిక ‘తెల్లజెండా’ ఊపింది. తెలంగాణా పోలీసులు ‘అక్షరాల తుపాకీ ట్రిగ్గర్’ నొక్కక ముందే, కాస్త సవరించిన పరిణామాల్లోనే ఈనాడు ‘సరెండర్’ అయిందనే చెప్పాలి. తన సహజ శైలికి విరుద్ధంగా పత్రిక తొలి పేజీలోనే మిమ్మల్ని ‘కించ పరిచే ఉద్దేశం లేదు’ మహా ప్రభో అంటూ భారీగానే వివరణ ఇచ్చుకుంది. పనిలో పనిగా తాము తెలంగాణా పోలీసులు శక్తి, యుక్తుల గురించి అనేక పాజిటివ్ కథనాలు కూడా రాశామని గతాన్ని గుర్తు చేస్తూ వార్తా కథనాల చిట్టాను ప్రస్తావించింది. అనేక సానుకూల కథనాలను కూడా పాఠకుల ముందుంచామని సాగిలపడింది. పోలీసు శాఖ నిబద్ధతపై ఎటువంటి అనుమానాలు ‘ఈనాడు’కు లేవని ముక్తాయించింది.
ఈనాడు వంటి ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ ఇంతలా బెదరడం, బెంబేలెత్తిన తీరులా వివరణ ప్రచురించడం బహుషా తన దశాబ్ధాల పాత్రికేయ చరిత్రలోనే అత్యంత అరుదు కావచ్చు. ఎందుకంటే తెలుగు జర్నలిజంలో ఈనాడు శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందరో సీఎంల హుంకరింపులను బేఖాతర్ చేసిన ట్రాక్ రికార్డ్ ఈనాడుకు ఉంది. మరెందరో ఉన్నత స్థాయి అధికారుల వివరణతో కూడిన వాదనలను డస్ట్ బిన్ లో వేసిందనే ప్రచారమూ ఉంది.
ఈనాడు ప్రస్థానంలో ఇటువంటి అనేక అంశాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. తన వార్తా కథనాలను సమర్ధించుకునే చాతుర్య శైలి ఈనాడుకు గల ప్రత్యేకతగానే పలువురు అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం ఈనాడు చేసింది తప్పా? ఒప్పా? అనేది ఇక్కడ చర్చ కాదు. కానీ తన సహజశైలికి విరుద్ధంగా పోలీసు శాఖపై రాసిన వార్తా కథనానికి వివరణ ఇస్తూ పాఠకులకు నివేదించడమే అసలు విశేషం.
‘దొంగలతో దోస్తీ’ శీర్షికన నిన్న ప్రచురించిన ఓ వార్తా కథనంపై తెలంగాణా హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్,హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్, రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్, వరంగల్ సీపీ రవీందర్ తదితర ఉన్నతాధికారులు వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశపు వివరాలను క్రోఢీకరించి మరీ మెయిన్ ఎడిషన్‌లోని ఫస్ట్ పేజీలో ‘తెలంగాణా పోలీసుల పనితీరు భేష్’ శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించడం గమనార్హం.
వాస్తవానికి ఇటువంటి అంశాల్లో రాజకీయ నేతలుగాని, అధికారులుగాని ఇచ్చే వివరణలు, విలేకరుల సమావేశాలకు సంబంధించిన వార్తలకు ఈనాడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ‘ఏ ప్రదేశంలోనైతే ఆరోపణలతో కూడిన వార్తను ప్రచురించారో, అదే స్థలంలో, అంతే ప్రాధాన్యత కల్పిస్తూ వివరణ ప్రచురించాలి’ అనే డిమాండునూ ఈనాడు ఖాతర్ చేయదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. కేంద్ర కేబినెట్లో వైఎస్ఆర్ సీపీ చేరే అంశంపై తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనపు అంశంలో ఆయన ఇచ్చిన వివరణను లోపలి పేజీల్లో, అసలు వార్తను తొలిపేజీలో ప్రచురించడమే తాజా నిదర్శనం.
ఇటువంటి శైలి గల ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ ఈనాడు తన సహజ శైలికి విరుద్ధంగా ఎందుకిలా సాగిలపడి మొదటి పేజీలోనే వివరణ ఇచ్చినట్లు? శాంతి భద్రతలను కట్టడి చేయడంలోనే కాదు, మీడియా ధోరణిని నిలువరించడంలోనూ తెలంగాణా పోలీసుల ‘ఆపరేషన్’ శైలికి ఈనాడు బెంబేలెత్తిందా? తెలుగు మీడియా సర్కిళ్లలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.