1980 దశకంలో ప్రతిఘటన తీవ్రవాద సంస్థ ముఖ్య నేత చలమన్న వద్ద ఏకే-47 ఆయుధం ఉందనే విషయం వెలుగులోకి వచ్చినపుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా వరంగల్ జిల్లా పోలీసులు నివ్వెరపోయారు. సంఘటన ఖచ్చితంగా గుర్తు లేదుగాని, ప్రతిఘటన, రామచంద్రన్ గ్రూపుల మధ్య వర్గపోరు సందర్భంగానో, పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల ఉదంతంలోనో చలమన్న వద్ద ఏకే-47 వెపన్ ఉందనే విషయం బహిర్గతమైంది. ఓ వాగు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో తుపాకీ గొట్టంలోకి ఇసుక వెళ్లిన కారణంగా తన చేతిలోని ఏకే-47 పేలకపోవడంతో చలమన్న దాన్ని అక్కడే వదిలేసిన కారణంగా అతని వద్ద ఈ అధునాతన ఆయుధమున్నట్లు పోలీసులు గుర్తించారు.
రామచంద్రన్, జనశక్తి గ్రూపులకు చెందిన నక్సలైట్ల వద్ద సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్) తుపాకులు ఉన్నట్లు గుర్తించిన సందర్భంగానూ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికి పోలీసులు వద్ద ఇటువంటి అధునాతన ఆయుధాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చలమన్నకు ఏకే-47, జనశక్తి, రామచంద్రన్ గ్రూపుల నక్సల్స్ కు ఎస్ఎల్ఆర్ వంటి అధునాతన తుపాకులు ఎలా వచ్చాయనేది అప్పట్లోనే పోలీసులు దర్యాప్తు జరిపారు. ‘పెన్ రివాల్వర్ల’ దిగుమతి స్థాయికి ప్రజాప్రతిఘటన నక్సల్ గ్రూపు చేరుకుందనే వార్తల నేపథ్యంలోనే దాని అగ్రనేతలు చలమన్న, జగ్గాని భిక్షపతి వంటి నాయకులు ఎన్కౌంటర్లో మరణించారన్నది వేరే విషయం. దశాబ్ధాల క్రితం నాటి ఈ అధునాతన ఆయుధాల అంశం ప్రస్తుత ప్రస్తావనకు కారణాలు లేకపోలేదు.
అసలు విషయంలోకి వెడితే… ఛత్తీస్ గఢ్ లోని అనేక జిల్లాల్లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మావోయిస్టు నక్సలైట్ల వద్ద ‘బుల్లెట్ ప్రూఫ్’ జాకెట్లతోపాటు టోపీలు కూడా ఉన్నాయా? ఇదీ తాజా సందేహం. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియలో భాగంగా ఛత్తీస్ గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ ప్రహార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిన్నటి కథనంలో చెప్పుకున్నాం కదా? ఆ పరంపరలోనే మావోయిస్టు నక్సల్స్ నెత్తిన ‘బుల్లెట్ ప్రూఫ్’ టోపీల అంశం తాజాగా వార్తల్లోకి రావడం విశేషం. సుక్మా జిల్లా తొండమర్కా, దుర్మా, బడేకదేవాల్ అడవుల్లో 30 గంటలపాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’లో ఐదుసార్లు పోలీసులకు,మావోయిస్టు నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారని కూడా పోలీసు వర్గాలు వెల్లడించినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా నివేదించింది. ఇదే సందర్భంగా సరికొత్త అంశాన్ని కూడా అక్కడి పోలీసు అధికారులు ప్రకటించారు.
సుక్మా ఏఎస్పీ సిద్ధార్థ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ, మావోయిస్టు నక్సల్స్ హైటెక్ వనరులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారన్నది అక్కడి మీడియా వార్తా కథనాల సారాంశం. సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో తొండమర్కా అడవుల్లో డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్) భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య సుదీర్ఘంగా కాల్పులు జరిగాయి. ఘటనానంతరం డీఆర్జీ బలగాలు తిరిగి వస్తుండగా, నక్సలైట్లు మళ్లీ వారిపై దాడిచేశారు. డీఆర్జీ పోలీసులు నక్సల్స్ కాల్పులను తిప్పకొట్టారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ‘బుల్లెట్ ప్రూఫ్’ జాకెట్లు ధరించారని, వారి వద్ద ఇవి ఉన్నట్లు గుర్తించడం తొలిసారిగా ఏఎస్పీ సిద్ధార్థ్ తివారీ పేర్కొన్నట్లు ఛత్తీస్ గఢ్ మీడియాతోపాటు జాతీయ వార్తా సంస్థలు సైతం నివేదించాయి.
కానీ మావోయిస్టు నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతోపాటు టోపీలు కూడా ధరించి ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడడం గమనార్హం. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత డీఆర్జీ బలగాలు ఈ సమాచారాన్ని అధికారులకు అదించారని, తమపై నక్సల్స్ 600కు పైగా యూబిజిఎల్ లను కాల్చారని వారు పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
కానీ బుల్లెట్ ప్రూఫ్ టోపీలు తమకే ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం ఉన్నవి జాకెట్లు మాత్రమేనని తెలంగాణా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పేరుగాంచిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను నక్సలైట్లు వినియోగిస్తున్నారనే అంశంలో వాస్తవం ఉంటే ఉండవచ్చన్నారు. పోలీసులపై దాడులు నిర్వహించిన సందర్భంగా ఆయుధాలతోపాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా నక్సలైట్లు చేజిక్కించుకున్న ఉదంతాలు అనేకం ఉండడమే ఇందుకు కారణమన్నారు. అంతేగాక అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకునే నక్సలైట్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సమకూర్చుకోవడం సమస్య కూడా కాదన్నారు. అయితే ముఖ్య నక్సల్ నేతలు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాడే అవకాశం ఉందని, అటువంటి నేతలకు కనీసం మూడంచెల భద్రతా వ్యవస్థ కూడా ఉంటుందని ఆయా పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
దేశ సైనిక బలగాలకే ఇటీవలే బుల్లెట్ ప్రూఫ్ టోపీలు అందుబాటులోకి వచ్చినట్లు వార్తల్లో చదివామని, తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంత పోలీసుల వద్దనేకాదు, ఏ రాష్ట్ర పోలీసుల వద్ద కూడా బుల్లెట్ ప్రూఫ్ టోపీలు లేవని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు. ‘ఆపరేషన్ ప్రహార్’లో కాల్పుల సందర్భంగా బహుషా హెల్మెట్లను నక్సల్స్ వాడి ఉండవచ్చని, వాటిని బుల్లెట్ ప్రూఫ్ టోపీలుగా ఛత్తీస్ గఢ్ పోలీసులు భావించి ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.