ఓ వైపు ఉప్పొంగుతున్న ఇంద్రావతి నది… మరోవైపు మావోయిస్టు నక్సలైట్ల భయం. భీతి గొలిపే కీకారణ్యంలోని ఆ పరమశివుని దర్శనం చేసుకునేందుకు ఆ ప్రాంత శివభక్తులెవరూ వెరవడం లేదు. ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోయినా, కాలినడక ప్రయాణానికీ కష్టమైన పరిస్థితుల్లోనూ భైరాంగఢ్ శివార్లలోని తులార్ అడవుల్లో గల శివున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడమే విశేషం.
ఏటా మహా శివరాత్రి సందర్భంగా దంతెవాడ, బీజాపూర్ సహా బార్సూర్ ప్రాంత శివార్లలో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న ఇంద్రావతి నదిని దాటుకుంటూ, మావోయిస్టు నక్సలైట్ల పెట్టని కోటగా ప్రాచుర్యం పొందిన తులార్ గుహలోని భోలేనాథ్ పరమశివున్ని దర్శనం చేసుకుంటారు. విశ్వవ్యాప్తంగా అనేక గుహలు ఉండొచ్చు. కానీ భోలేనాథ్ తులార్ గుహ అద్భుతం వర్ణించలేనిదని భక్తులు చెబుతుంటారు. భోలేనాథ్ ఉన్నటువంటి తులార్ గుహ అతీంద్రీయ అద్భుతాలకు నిలయంగా భక్తులు విశ్వసిస్తుంటారు.
తులార్ గుహలోని శివలింగం ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే… మాఘ మాస పౌర్ణమి సందర్భంగా, మహాశివరాత్రి, వసంత రుతువు కాలంలో గుహ శిలల నుంచి నీటి ప్రవాహం ఆకస్మికంగా శివలింగంలోకి జాలువారడం. ఈ అద్భుత దృశ్యాన్ని స్థానికులు భోలేనాథ్ మహత్యంగా అభివర్ణిస్తుంటారు.
బార్సూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోగల తులార్ గుహలోని భోలేనాథ్ శివున్ని దర్శించుకోవడానికి అత్యంత దుర్లభ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. రమణీయమైన కొండలు, ఇంద్రావతి నది, అనేక చిన్న చిన్న జలపాతాలను దాటుకుంటూ రాళ్ల మార్గాన్నే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటాక గాని తులార్ మహదేవుని శివలింగం సమీపానికి చేరుకోలేరు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల అలికిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలోనే నక్సలైట్లకు, పోలీసులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి.
ఇటువంటి పరిస్థితుల్లోనూ మహాశివరాత్రి సందర్భంగా తులార్ శివుని దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. బచేలి, గీదం, బార్సూర్, దంతెవాడ, భైరాంగఢ్, బీజాపూర్ తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. గీదంనగర్ కు చెందిన కొందరు భక్తులు ఓరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని శివలింగానికి అభిషేకం చేస్తారు. నక్సలైట్ల భయం కారణంగా గడచిన ఏనిమిదేళ్లుగా తులార భోలేనాథ్ మార్గం కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. దీంతో ఇక్కడికి చేరుకోవాలంటే ద్విచక్రవాహనాలు, సైకళ్లపై లేదంటే కాలినడకన అత్యంత కష్టంగా ఇక్కడికి చేరుకోవచ్చు.
బార్సూర్ సమీపంలోని కొడ్నార్ ఘాట్ నుంచి ఇంద్రావతి నదిని దాటిన తర్వాత కోస్లానార్, మంగనార్, గుహ గ్రామం మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. సతాధర్ నుంచి మంగనార్ వరకు కాలినడకకు సైతం కష్టతరమైన మార్గంలోనే ప్రయాణించాలి. అయినప్పటికీ అటవీ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు ప్రయాణించి భారీ సంఖ్యలో భక్తులు తులార్ భోలేనాథ్ దర్శనానికి బారులు తీరడం విశేషం. హర హర మహదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణ ద్వారా ప్రయాణించే తమకు మహదేవుడే అండగా ఉన్నప్పుడు తమను ఎవరూ అడ్డుకోలేరని అక్కడికి చేరుకున్న భక్తులు చెబుతుంటారు.
(బస్తర్ కీ ఆవాజ్ సౌజన్యంతో…)