‘ప్రభాస్ కు నో చెప్పిన రకుల్’ ఇదీ ఈనాడు వెబ్ సైట్లో దర్శనమిచ్చిన హెడ్డింగ్. ‘ఎందుకో తెలుసా?’ అంటూ చిన్నక్షరాలతో మరో సబ్ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ లో గోచరిస్తున్న అర్థం ఏమిటి? ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… సినీ హీరో ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఏదో లక్ష్యం వల్ల తాను ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయానని, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశానని రకుల్ చెప్పిందన్నది అసలు వార్తా కథనపు సారాంశం. కానీ హెడ్డింగ్ చదివితే ఈ సారాంశం స్ఫురిస్తున్నదా? ‘నాలుగు రోజులు షూటింగ్ కు వెళ్లి…, ఎందుకో తెలుసా?‘ అంటూ చిన్న సైజు అక్షరాల్లో సబ్ హెడ్డింగులు కూడా పెట్టారు. తెలుగు జర్నలిజంలో విప్లవాత్మక పోకడలకు ఆద్యుడిగా ప్రాచుర్యం పొందిన రామోజీరావు సొంత సైట్లో ఈ తరహా హెడ్డింగులు రావడం విచిత్రంగా పలువురు జర్నలిస్టులు అభివర్ణిస్తున్నారు.
ఎవడో అర్భకుడు తన సైట్ ను పాపులర్ చేసుకోవడానికి ఈ తరహా హెడ్డింగ్ లు పెట్టి నడుపుకుంటున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కొందరు మహిళా నటుల సినీ పాత్రలపై ద్వంద్వార్థ పదాల హెడ్డింగులతో తన పైశాచిక ముచ్చట తీర్చుకుంటున్నాడంటే అతన్ని చూసి జాలి పడవచ్చు. కానీ ఈనాడు అంటే ఓ చరిత్ర. రామోజీరావు అంటే పత్రికారంగంలో ఓ లెజెండ్. అటువంటి రామోజీ సైట్లో ఈ తరహా హెడ్డింగులు వాడుతున్న తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతో మంది భావి జర్నలిస్టులను తయారు చేస్తున్న రామోజీ స్కూల్లో నేర్పుతున్న జర్నలిజపు అక్షర విలువల సారాంశం ఇదేనా? మేం సదుద్ధేశంతోనే ఆ తరహా హెడ్డింగులు వాడుతున్నామని, చదివేవారు రిసీవ్ చేసుకోవడంలోనే లోపముందని, క్రియేటివిటీ లేకుంటే వెంటనే ఆన్ లైన్ పాఠకులు సైట్ మార్చేస్తున్నారంటూ రామోజీ వెబ్ సైట్ బాధ్యులు సమర్థించుకుంటే చేయగలిగేది కూడా ఏమీ లేదు…ఇదే రామోజీ స్కూల్లో నాలుగు జర్నలిజపు అక్షరాలు నేర్చుకున్నందుకు బాధ పడడం మినహా.