తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ ఇదీ ఓ విశేషమే. గిరిజన సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పాలకవర్గ నేతలు చెప్పే మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడించే ఆసక్తికర పరిణామమిది. ఓ విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన పేరుపై గల ఫౌండేషన్ ద్వారా ఆదివాసీల కోసం మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచి, నిర్వహణకు దాతలు సహకరించాలని అభ్యర్థించడం కాకతాళీయమే కావచ్చు. కానీ ఈ పరిణామాలకు గల కారణాలేమిటి? అనే అంశంపై సర్కారు పెద్దలు, అధికారులు మేధోమథనం చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందనేది నిర్వివాదం.
గిరిజన ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటీడీఏ), గిరిజన సంక్షేమ శాఖలు ఉంటాయి కదా? గిరిజన విద్యార్థుల కోసం ఐటీడీఏ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కదా? మరి ఓ విపక్ష ఎమ్మెల్యే తన ఫౌండేషన్ ద్వారా మూతపడిన స్కూళ్లు నడపడమేమిటి? ఇదీ అసలు ప్రశ్న. ఔను రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది ఐటీడీఏలు ఉండేవి. ప్రత్యేక తెలంగాణాలో ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు పడిపోయినట్లుంది. ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం కేంద్రాలుగా ఇవి పనిచేస్తున్నాయి. కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లాలకు సంయుక్తంగా గతంలో సుండుపెంటలో గల చెంచు ప్రాజెక్టు స్థితి ఇప్పుడెలా ఉందో తెలియదు.
ఏటూరునాగారం కేంద్రంలో ఐటీడీఏ ఉండగా, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన పేరున గల ఫౌండేషన్ పేరుతో మూతపడిన ఆదివాసీ ప్రాంతాల్లోని పాఠశాలలను సీఎం కేసీఆర్ పుట్టిన రోజునే ప్రారంభించడం యాధృచ్ఛికమే కావచ్చు. సీతక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం తోగు, ఏటూరునాగారం మండలం చింతలమోరీ తదితర ఆదివాసీ గూడేల్లో మూతబడిన స్కూళ్లను ఆమె ప్రారంభించారు. పేద పిల్లలు చదువుకు దూరంగా ఉండడం దేశానికి మంచిది కాదని, ఈ పిల్లలను మీ పిల్లలుగా భావించి తోచిన విధంగా సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా అభ్యర్థించారు.
ఇంతకీ ఎక్కడివీ స్కూళ్లు? ఎందుకు మూతపడ్డాయి? అంటే… ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరంలేని బడులివి. ఓ రకంగా చెప్పాలంటే పాలకులకు పట్టని ఆదివాసీ పిల్లల విద్యాబుద్దుల కేంద్రాలు. ఛత్తీస్ గఢ్ నుంచి బతుకు జీవుడా అంటూ పొట్ట చేతబట్టుకుని తెలంగాణా అడవుల్లో ఆశ్రయం పొందిన గొత్తకోయల పిల్లలకు సంబంధించి సరస్వతీ నిలయాలు. ములుగు నియోజకవర్గంలోని పలు మండలాల్లో గల అటవీ ప్రాంతాల్లో పూరి పాకలు వేసుకుని జీవిస్తున్న గొత్తికోయ తెగకు చెందిన ఆదివాసీ పిల్లలకు స్థానికంగా ఎటువంటి స్కూళ్లు లేవు. సుదూరాల్లో గల గిరిజన సంక్షేమ శాఖ స్కూళ్లకు వెళ్లడానికి ఆ పిల్లల వయస్సు సహకరించదు. ఎటువంటి రవాణా సదుపాయాలు కూడా లేవు. దీంతో ఈ చిన్నారులకు చదువు చెప్పేందుకు ‘మారి’ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో ముందుకొచ్చింది.
ఆర్థిక కష్టాలో, మరే ఇతర కారణాలో తెలియదుగాని ఈ స్కూళ్ల నిర్వహణను ‘మారి’ సంస్థ మధ్యలోనే వదిలేసింది. దీంతో రెండు నెలలుగా ములుగు నియోజకవర్గంలోని 20 స్కూళ్లు మూతపడ్డాయి. ఫలితంగా ఆయా స్కూళ్లలో అక్షరాలు నేర్చుకుంటున్న ఆదివాసీ చిన్నారుల చదువు అగాధంలో పడింది. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయా పాఠశాలల నిర్వహణను తన ఫౌండేషన్ ద్వారా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు సోమవారం 20 స్కూళ్లను తన చేతుల మీదుగానే స్వయంగా పునః ప్రారంభించారు. వచ్చే మూడు నెలలపాటు స్కూళ్ల నిర్వహణకు టీచర్ల వేతనాలకయ్యే దాదాపు రూ. 4.00 లక్షల మొత్తాన్ని సీతక్క ఫౌండేషన్ భరించనుంది.
ఇంతకీ ఆయా ఆదివాసీ గూడేల్లో గిరిజన సంక్షేమ శాఖ స్కూళ్లు ఎందుకు నడపడం లేదు? ప్రభుత్వం వారిని ఎందుకు పట్టించుకోవడం లేదనేగా అసలు సందేహం? వాళ్లు రోహింగ్యాలు మాత్రం కాదు.. ఛత్తీస్ గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయ తెగకు చెందిన ఆదివాసీలు మాత్రమే. ఈ అంశంలో అధికారుల వైఖరికి కారణాలు అనేకం. అవి మరో కథనంలో వివరంగా చెప్పుకుందాం. ఆదివాసీ గూడేల్లో సీతక్క ప్రారంభించిన స్కూళ్ల చిత్రాలను దిగువన స్లైడ్ షోలో చూడండి.