ఇప్పుడు ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రవేశాలు (Admissions) తగ్గుముఖం పట్టాయి. సెంట్రల్ సిలబస్ ఉన్న విద్యాసంస్థలే కాదు, స్టేట్ సిలబస్ ఉన్న విద్యాసంస్థల్లో కూడా ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయి.
తల్లిదండ్రుల్లో తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరిక బలంగా ఉండడంతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేశాయి. అధిక మొత్తంలో తల్లిదండ్రులనుండి ఫీజులు వసూలు చేసి విద్యావ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లజేసుకుంటున్నాయి.
రెండో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఫీజులు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోయినా తల్లిదండ్రులు ఈ పోటీ సమాజంలో తమ పిల్లలు ఏమాత్రం వెనుకంజలో ఉండకూడదనే పట్టుదలతో ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ విద్యాసంతలతో పోల్చితే ఈ ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ఉపాధ్యాయుల నాణ్యత’ ఏమాత్రం సరితూగకపోయినా ఇంగ్లీషు మీడియం అనే ఒక్క ఆశతోనే ప్రజలు ప్రైవేటు సంస్థల వైపు పరుగెడుతున్నాయి.
పెద్ద జీతాలు అందుతున్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు సరైన స్థాయిలో బోధన చేయకపోవడం, అలసత్వం ప్రదర్శించడం, మొక్కుబడి బోధన వంటి అవలక్షణాలు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ‘కరోనా వైరస్’లా పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు సంస్థలకు పంపుతున్నారు.
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభించేందుకు సమాయత్తం అవుతుండడంతో ప్రజలు ప్రభుత్వ విద్యాసంస్థలవైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలూ, వారి చందాలు ఇతర బంధాలతో నడుస్తున్న రాజకీయ పార్టీలూ నేతలూ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రతిపాదనను సహజంగానే వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యాపారం పడిపోవడంతో కొందరు ఏకంగా కోర్టుకు వెళుతుంటే, ఈ వ్యాపారుల చందాలతో, వాటాలతో అనుబంధం ఉన్న నేతలు చట్టసభల్లో అడ్డుకుంటున్నారు.
సామాజిక బాధ్యత విస్మరించి తమ సామాజిక బాధ్యత మాత్రమే భుజానికెత్తుకున్న కొన్ని మీడియా సంస్థలు ‘అమ్మ భాష’ అంటూ పేజీలకు పేజీల వార్తలు వండి వడ్డిస్తున్నాయి.
తమ పిల్లల్ని, వారిపిల్లల్ని ఇంగ్లీషు మీడియం విద్యాసంస్థల్లో ఉదయం వదిలిపెట్టి, సాయంత్రం మళ్ళీ తెచుకునేవరకూ ఉన్న ఖాళీ సమయాన్ని ‘మాతృభాష’ సేవలో గడిపేస్తున్నారు.
ఇలాంటి ‘విరామ సమయ ఉద్యమాలను’ ప్రజలు గుర్తించారు. అమ్మ భాషను కూడా వ్యాపారంకోసం వాడుకుంటున్న కుట్రలను ప్రజలు గుర్తిస్తున్నారు. గమనిస్తున్నారు.
ఇక ఇప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు హక్కుల పోరాటాలు కాసేపు పక్కనపెట్టి పిల్లలకు చదువు చెప్పడం బాధ్యతగా గుర్తించాలి. కనీసం రోజుకు ఓ గంటసేపైనా పాఠం చెప్పే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తే ప్రభుత్వ పాఠశాలలు ప్రజలవి అవుతాయి.
ఉపాధ్యాయుల జీతాలకు తప్ప విద్యార్థుల చదువులకు పనికిరాకుండా పోయిన ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యాలయాలుగా, విజ్ఞానాలయాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే తీసుకున్న జీతం, ఆ జీతంతో తింటున్న అన్నం జీర్ణం అవుతాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులూ ఆలోచించండి. పాఠాలు చెప్పడం మళ్ళీ మొదలుపెట్టండి.
విద్యావ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళతో బంధాలు ఉన్న వాళ్ళు మాతృభాషను మీ ఇళ్ళల్లో పరిరక్షించుకోండి. అలా మీ మాతృభాషాభిమానాన్ని కొనసాగనివ్వండి.
-దారా గోపి @fb