తుపాకీ చేతిలో ఉంది కదా… అని అసందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపితే ఏమవుతుంది? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓ మాజీ ఆర్మీ జవాన్ అప్పుడెప్పుడో 45 రోజుల క్రితం గాల్లోకి జరిపిన కాల్పుల ఘటన ఇప్పుడు అతన్ని కేసై చుట్టుకోవడమే ఈ వార్తా కథనంలోని అసలు విశేషం. వివరాల్లోకి వెడితే…
అతని పేరు బద్దం తిరుమల్ రెడ్డి. రిటైర్డ్ ఆర్మీ జవాన్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట నివాసి. నిన్న రాత్రి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు సమయంలో కొందరు యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాయికుమార్, ఉప సర్పంచ్ భర్త కూడా అయిన మాజీ ఆర్మీ జవాన్ తిరుమల్ రెడ్డి ఘర్షణకు దిగిన యువకులను మందలించారు. కాసేపటికి ఘర్షణ వాతావరణం సమసిపోయిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ శుక్రవారం నాటికి సీన్ మారిపోయింది.
శాయంపేటలో ఆర్మీ మాజీ జవాన్ తిరుమల్ రెడ్డి గన్ పేల్చారని, పెళ్లి బరాత్ లో ఘటన జరిగిందని, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారనే సారాంశంతో వార్తలు గుప్పుమన్నాయి. ఇంకేముంది అసలు మీడియా, సోషల్ మీడియాలో వార్తల వెల్లువ. ఎవరికి తోచిన కథనాలు వారు ప్రచారంలోకి తీసుకువచ్చారు.
కానీ అసలు విషయం గురించి తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. వాస్తవానికి గురువారం రాత్రి జరిగిన పెళ్లి ఊరేగింపు ఘర్షణ ఘటనలో తిరుమల్ రెడ్డి ఎటువంటి కాల్పులు జరపలేదట. గత డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనతోపాటు ‘ఎంజాయ్’ చేసిన మిత్రులు, యువకులు ఓ చిరు కోరిక కోరారట. తుపాకీ కాలుస్తుంటే చూడాలని ఉందనే ఆ కొందరి కోరిక మేరకు తిరుమల్ రెడ్డి గత డిసెంబర్ 31న అర్థరాత్రి సమయంలో తన వద్ద గల డబుల్ బ్యారెల్ (డీబీబీఎల్) లైసెన్సుడ్ గన్ తో గాల్లోకి ఫైర్ చేశాడట.
అయితే గురువారం రాత్రి పెళ్లి బరాత్ సందర్భంగా ఘర్షణ వద్దని యువకులను వారించడమే కాల్పుల ఘటన వెలుగు చూడడానికి ప్రధాన కారణమట. తిరుమల్ రెడ్డి తనకు మద్ధతుగా నిలవలేదనే అక్కసుతో డిసెంబర్ 31నాటి కాల్పుల ఘటనను వీడియో తీసిన యువకుడొకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడట. దీంతో పోలీసులు రంగ్రపవేశం చేశారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ హబీబ్ ఖాన్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ ప్రేమ్ కుమార్ తదితరులు శాయంపేటకు చేరుకుని, విచారణ జరిపి తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమల్ రెడ్డి నుంచి ఓ డీబీబీఎల్ తుపాకీని, 10 తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
గ్రామస్తుల సరదా కోసం విచక్షణ మరచి అసందర్భంగా కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ తిరుమల్ రెడ్డిని ఇలా ఇప్పుడు కేసై చుట్టుకుందన్నమాట. కాల్పులు ఎప్పుడు జరిపారన్నది ముఖ్యం కాదు… అది చట్ట విరుద్ధమా? కాదా? అన్నదే ఇక్కడ ప్రధానం. అందుకే చట్టం తన పని తాను చేసింది. మొత్తం ఘటనలో కొసమెరుపు ఏంటంటే… తాను జమ్మూలోని ఓ ఆయుధ షాపులో కొనుగోలు చేసిన ఈ తుపాకీ పైకం చెల్లించేందుకు తిరుమల్ రెడ్డి ఇచ్చిన చెక్ కూడా చెల్లుబాటు కాలేదట. తనకు డబ్బు చెల్లించాలని జమ్మూలోని ఓ ఆర్మరీ షాపు యజమాని రాసిన లేఖ కూడా ఈ సందర్భంగా బహిర్గతమైంది. తిరుమల్ రెడ్డి కాల్పులు జరిపిన వీడియోను దిగువన చూడవచ్చు.