ధృతరాష్ట్రుడికి కంటి చూపు లేదు. అది శాపమో… లోపమో… స్వయంకృతం కాదు.
ఆయన భార్య గాంధారికి కంటి చూపు ఉంది. కానీ భర్తమీద గౌరవంతో తానూ ఈ లోకాన్ని చూడడం మానేసింది. కళ్ళకు గంతలు కట్టేసుకుంది.
ఆ దంపతులకు పెద్దకొడుకు దుర్యోధనుడు, రెండో కొడుకు దుశ్శాసనుడు ఏం చెబితే అదే లోకం. కళ్ళముందు జరిగేవన్నీ వినడం, దుర్యోధనుడో, దుశ్శాసనుడో చెప్పినమేరకు ఊహించుకోవడం. అంతవరకే.
జూదం జరుగుతోందని తెలుసు… కానీ అది మాయా జూదం అని తెలియదు. ఆ విషయం దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ చెప్పలేదు. శకుని ఆడించాడు. కర్ణుడు తోడున్నాడు. చూపులేని తండ్రిని, చూపు ఉండీ చూడలేని తల్లిని విజయవంతంగా మోసం చేస్తున్నామనుకున్నారు.
మహాభారత యుద్ధం మొదలయ్యాక తమ బిడ్డలే తమను మోసం చేశారని, జరుగుతున్న వాస్తవాలను కప్పిపుచ్చారని, లేదా వక్రీకరించి చెప్పారని తెలుసుకున్న తల్లిదండ్రులు విలపించడం తప్ప ఆ దశలో ఏం చేయగలరు?
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కూడా అంతే. కొందరు ధృతరాష్ట్రుడిలా చూపు లేనివారు. మరికొందరు గాంధారిలా చూపు ఉపయోగించలేని వారు. వీరికి ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా ఏం చెబితే అదే వార్త. ఏం చూపిస్తే అదే నిజం.
ఆరు రోజులపాటు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడుల గురించి, ఆ తర్వాత ఐటీ అధికారులు విడుదల చేసిన ప్రకటన గురించి ఈ మీడియా చెప్పలేదు… చెప్పబోదు…
ఈ మీడియా చెప్పనిదే ధృతరాష్ట్రుడికి, గాంధారికి లాగానే తెలుగు ప్రజలకు కూడా ఏం జరిగిందో, ఏం జరుగుతోందో తెలియదనే భ్రమలో ఉన్నారు.
కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. అపరిమిత డేటా ఇచ్చే సిమ్ కార్డు ఉంది. దాచేస్తే నిజం దాగుతుందా!?
– దారా గోపి @fb