అధికార పార్టీ లీడర్లంటే ఎట్లుండాలె…? మస్త్ దిల్ దార్గ ఉండాలె. మరీ కంజూష్ ఏషాలు ఏసినప్పుడే పబ్లిక్ రకరకాలుగ సెప్పుకుంటరు. ఇజ్జత్ గూడ దీస్తరు. అరె… గిదేందివయా..? గిట్లుంటదా ఎక్కడన్న గింత కక్కుర్తి? మరీ గజ్జి ఎవ్వారం గాకపోతె…? కండూతి కోసం గిట్ల గూడ జేస్తరా..? అదీ రూలింగ్ పార్టీ నాయకులు. ఒక్కసారి గాదు… రెండోసారి గూడ అదికారంలోకొచ్చిండ్లు గదా… ఎంత తరీకగుండాలె? అందుకే మల్ల… సరే… గా పనేదో చేస్తే జేసినవ్ గని… మరి పైసలెప్పుడిస్తవ్…? అని ఆంద్రజోతి పేపరోల్లు అడిగే సరికి గా జనగామ్ల రూలింగ్ పార్టీ లీడర్ ఒకాయన నాకేం దెల్వద్.. నాకేం దెల్వద్.. అంటూ పెట్టిన పోస్టును ఎంటనే డిలీట్ జేసిండట. గమ్మతుగున్నది గదా..? గీ సంగతి…? సరే ఇక పత్రికా భాషగా పరిగణించే వ్యవహారిక భాషలోనే అసలు విషయం చెప్పుకుందాం.
తెలంగాణాలోని జనగామ ఎమ్మెల్యే తెలుసు కదా? అదేనండీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. అధికార పార్టీ తరపున జనగామ నుంచే మరోసారి గెల్చిన ఎమెల్యే. అసలే అధికార పార్టీ… ఆపై ఎమ్మెల్యే. సారువారి పుట్టినరోజు. మొన్న జరిగింది లెండి. మొన్నంటే మొన్ననే.. ఖచ్చితంగా నిన్నగాక మొన్ననే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బర్త్ డే వేడుకల సందర్భంగా చిన్నా, చితకా లీడర్ల సంబరం అండబరాన్నంటిందట. మరి ఎమ్మెల్యే సాబ్ బర్త్ డే సందర్భంగా హడావిడి చేసే దిగువ స్థాయి లీడర్లు ఊరకనే ఉండరు కదా? ఊడుగుల నరసింహులు అనే నాయకుడొకాయన ఈ సందర్భంగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎవరో తయారు చేసిన యాడ్ (ప్రకటన) ఇమేజ్ లో సదరు నాయకుని ఫొటో స్థానంలో (ఇమేజ్ ను స్పష్టంగా చూస్తే కనిపిస్తుంది) తన ఫొటో వేసుకుని సోషల్ మీడియాలో ఇమేజ్ ను పోస్ట్ చేశాడట. ఇందులో తప్పేముంది? అని అప్పుడే ఓ నిర్ణయానికి రాకండి. ఇక్కడ తప్పొప్పుల తర్కం కానే కాదు.
సదరు యాడ్ ఇమేజ్ కు ఎగువ భాగాన ‘ఆంధ్రజ్యోతి’ మాస్ట్ హెడ్ (పత్రిక టైటల్ డిజైన్) ను తగిలించి మరీ వాట్సాప్ గ్రూపుల్లోనేగాక సోషల్ మీడియాలోని మిగతా వ్యవస్థల్లో అప్ లోడ్ చేశాడట. దీన్ని చూసిన ఆంధ్రజ్యోతి అడ్వైర్టయిజ్ మెంట్ విభాగానికి చెందిన ఉద్యోగి ఒకరికి చిర్రెత్తుకొచ్చిందట. ‘సరే… ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఎమ్మెల్యేగారి యాడ్ ఇచ్చావ్ కదా? పైసల్ ఎప్పుడిస్తవ్? బిల్లు పంపించనా? నువ్వే వచ్చి బిల్లు చెల్లిస్తావా? నన్నే వచ్చి తీసుకోమంటావా? అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా? మొత్తం ఒకేసారి ఇస్తావా? ఇంతకీ ఎప్పుడు రమ్మంటావ్? ఎక్కడ కలవమంటావ్? క్యాష్ ఇస్తావా? చెక్ ఇస్తావా? నేరుగా అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తావా;? లేదంటే గూగుల్ పే చేస్తావా? ’ అనే ప్రశ్నల సారాంశంతో సదరు ఆంధ్రజ్యోతి ఏడీవీటీ ఉద్యోగి వాట్సప్ గ్రూపులోనే ప్రశ్నల వర్షం కురిపించేసరికి మన నరసిహ్మన్నకు దిమ్మ తిరిగిందట. వామ్మో పేపర్ టైటిల్ వాడుకుంటే పైసల్ అడుగుతరా? అని బెంబేలెత్తిపోయి వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అప్ లోడ్ చేసిన మార్ఫింగ్ యాడ్ ను డిలీట్ చేశారట. ఇంతకీ ఆంధ్రజ్యోతి యాడ్ రెప్రజెంటేటవ్ కోపానికి కారణం ఏంటనేగా మీ డౌటు? అసలే యాడ్లు రాక, టార్గెట్లు నిండక సతమతమవుతున్న పత్రికల సిబ్బంది దీనావస్థ దుస్థితిలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వంటి ఎమ్మెల్యే అభిమానులైన అధికార పార్టీ లీడర్లు కొందరు మరీ ఇలా కక్కుర్తి కండూతికి పాకులాడడం మాత్రం సబబేనా? న్యాయం మీరే చెప్పండి.