భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ అడవుల్లో నిన్న పోలీసులకు, మావోయిస్టు నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు కోబ్రా పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కమాండెంట్ సహా మరో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టు నక్సల్ కూడా ఒకరు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
అయితే వాస్తవానికి ఈ సంఘటనలో మావోయిస్టు నక్సల్స్ కోబ్రా పోలీసులపై ‘అంబుష్’ దాడి చేసినట్లు సమాచారం. పామేడు పరిసరాల్లో మావోయిస్టుల సంచారం సమాచారంతో కోబ్రా పోలీసులు తిప్పాపురం సమీపంలోని బేస్ క్యాంప్ నుంచి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గడచిన రెండు రోజులుగా పోలీసులు తమ విధులను నిర్వహించి తిరిగి బేస్ క్యాంపునకు వస్తుండగా, మాటు వేసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడం వల్లే పోలీసులకు ప్రాణనష్టం జరిగినట్లు తెలిసింది. నక్సల్స్ అనూహ్య దాడి నుంచి తేరుకున్న కోబ్రా పోలీసులు ఎదురుకాల్పులకు దిగగా నక్సలైట్ ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.
కాగా మావోల అంబుష్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కోబ్రా పోలీసులు వికాస్ కుమార్, పూర్ణానంద్ లకు ఛత్తీస్ గఢ్ డీజీపీ అవస్థీ నివాళులర్పించారు. అమరులైన జవాన్ల మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు పంపించారు.