ఫిబ్రవరి 14… ఈ తేదీ ప్రస్తావన రాగానే ఏం గుర్తుకు వస్తుంది? ఆ మాత్రం తెలీదా? ప్రేమికుల రోజు… అంతేగా… అంటారా? అంతేకాదు… ఇప్పుడు ఈ తేదీకి మరో విశేషాన్ని కూడా జోడించాల్సిన అవశ్యకత కూడా ఏర్పడవచ్చు. ఇక నుంచి ఫిబ్రవరి 14వ తేదీ ‘కేజ్రీవాల్ సీఎం డే’గా చరిత్రలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీ… ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజా వార్తల సారాంశం. వాస్తవానికి ‘వాలంటైన్స్ డే’ రోజున కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ తేదీకి మరో చరిత్ర కూడా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్ తో పొత్తు దీర్ఘకాలం పొసగకపోవడంతో కేజ్రీవాల్ తన సీఎం పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతర పరిణామాల్లో 2015న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ రెండోసారి సీఎంగా అదే సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేశారు.
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి సైతం ఫిబ్రవరి 14వ తేదీనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఇక నుంచి ఫిబ్రవరి 14 కేవలం వాలంటైన్స్ డే మాత్రమే కాదు… ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఓసారి రాజీనామా, రెండుసార్లు పగ్గాలు చేపట్టిన రోజుగా కూడా చరిత్రలో నిలిచిపోనుంది. మొత్తంగా ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే మాత్రమే కాదు… ‘కేజ్రీవాల్ సీఎం’ పదవితో కూడా పెనవేసుకుంటుందన్నమాట. అదీ విషయం.