తెలంగాణాలోని భద్రాచలం సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, డిప్యూటీ కమాండర్ సహా మరో నలుగురు కోబ్రా పోలీసులు గాయపడ్డారు. వీరిలో డిప్యూటీ కమాండర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లోని తిప్పాపురం పరిసరాల్లో గల క్యాంపునకు చెందిన కోబ్రా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా పామేడు ప్రాంత అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తారసపడిన మావోయిస్టు నక్సలైట్లతో పోలీసులు తలపడ్డారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు మూడు దఫాలుగా నక్సల్స్, పోలీసులు పరస్పరం కాల్పులతో తలపడ్డారు. ఘటనలో ఇద్దరు కోబ్రా పోలీసులు మృతి చెందారు. మరో నలుగురు కోబ్రా జవాన్లు కూడా గాయపడగా, క్షతగాత్రుల్లో డిప్యూటీ కమాండర్ స్థాయి అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎన్కౌంటర్ ఘటనలో నక్సలైట్లకూ ప్రాణ నష్టం జరిగిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.