గడచిన ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చేది. రాష్ట్రంలో ఎలాంటి కారణాలవల్ల ‘నెగటివ్’ ప్రచారం వద్దు అనేది ఈ మెసేజ్ సారాంశం.
రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం చేసే దుష్ప్రచారానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వవద్దు. అందువల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతాయి. ఒక ‘పాజిటివ్ అట్మాస్పియర్’ కల్పించడం అవసరం అని ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పేది.
ప్రతిపక్షాల విమర్శను ‘రాక్షసుల దాడి’గా అభివర్ణించి కొట్టిపారేసింది. మీడియా కూడా ప్రతిపక్షాల వార్తలకు అంత ప్రాధాన్యత లేకుండా మొత్తంగా రాష్ట్రంలో ‘పాజిటివ్ అట్మాస్పియర్’ చూపించే వార్తలే ఎక్కువగా, ప్రముఖంగా వచ్చేవి. ‘ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలం’ అనో ‘రాష్ట్రంలో పెట్టుబడుల వరదలు’ అనో వార్తలు ప్రధాన శీర్షికల్లో వచ్చేవి.
విచిత్రం ఏమంటే ఇప్పుడు అదే నేతలు, అవే మీడియా సంస్థలు వార్తల స్టయిల్ మార్చేశాయి. ‘రాష్ట్రంపై ప్రభావం చూపే నెగటివ్ వార్తలు వద్దు’ అని చెప్పిన నేతలు ఇప్పుడు నిత్యం అవే మాటలు చెపుతున్నారు. అలా ‘నెగిటివ్’ వార్తలే ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి.
ప్రభుత్వ పెద్దలు ఒక దేశం సందర్శించినా, ఒక కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిపినా పతాక శీర్షికల్లో వచ్చిన వార్తలు ఇప్పుడు అసలు కనిపించడం లేదు. పైగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్న వార్తలు (నిజమో, అబద్దమో తెలియకుండానే) ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆలోచన, ఆచరణల ధోరణిలో వచ్చిన ఈ మార్పు రాజకీయాలకోసమా లేక రాష్ట్రం కోసమా? రాష్ట్రం కోసమైతే అప్పటి ‘పాజిటివ్ అట్మాస్పియర్’ దృక్పథం ఇప్పుడు కూడా అవసరమే కదా!?
రాష్ట్రాభివృద్ధి లక్ష్యం అయినప్పుడు భయోత్పాత వాతావరణం కనిపించే వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు చేయడం, అలాంటి వార్తలు మీడియా ప్రముఖంగా చూపించడం సమర్ధనీయం కాదు కదా? మరెందుకు ఈ మార్పు?
అప్పుడు రాష్ట్రం కోసం కావాల్సిన ‘పాజిటివ్ అట్మాస్పియర్’ ఇప్పుడు అవసరం లేదా? ఇంతకూ ‘పాజిటివ్ అట్మాస్పియర్’ రాష్ట్రం అభివృద్ధికోసమా లేక ఒక పార్టీ మాత్రమే అధికారంలో ఉండడం కోసమా?
-దారా గోపి @fb