హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో గల సాయి సంజీవని ప్రయివేట్ ఆసుపత్రి. తీవ్రంగా కాలిన గాయాలతో గల ఓ వ్యక్తిని ఆదివారం ఉదయం ఈ ఆసుపత్రిలో చేర్చారు. పేషెంట్ పేరు రావ్ సాబ్. వయస్సు సుమారు 48 సంవత్సరాలు. మహారాష్ట్రకు చెందిన రావ్ సాబ్ సినిమా సెట్టింగ్ పనులకు సంబంధించిన కార్మికుడు. ఆదివారం తెల్లవారుజామున తాను పనిచేస్తున్న ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డాడు. యాభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన రావ్ సాబ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతని రెండు చేతులు తొలగిస్తే తప్ప ప్రయోజనం లేదని వైద్యులు సూచించినట్లు సమాచారం.
పొట్ట కూటికోసం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వచ్చిన అనేక మంది కార్మికుల్లో రావ్ సాబ్ కూడా ఒకరు. సినిమా సెట్టింగులకు సంబంధించి ప్లాస్టిక్ షీట్ల అతికింపు పనుల్లో వీళ్లు పనిచేస్తున్నట్లు తెలిసింది. పనిచేస్తున్న ప్రాంతంలోనే ‘పేలుడు’ జరిగి రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డారనేది ప్రాథమిక సమాచారం. అయితే ఈ సంఘటనను సినిమా సెట్టింగ్ నిర్వహణ సంబంధీకులు గోప్యంగా ఉంచడానిక గల కారణాలేమిటి? పేలుడు ఘటనకు దారి తీసిన పదార్థాలేమిటి? గాయపడిన కార్మికునికి అత్యంత రహస్యంగా చికిత్స జరిపించాల్సిన అగత్యమేమిటి? వంటి అనేక ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తీవ్రంగా గాయపడిన రావ్ సాబ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.