ఒక్కోసారి కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు నర్మగర్భపు అర్థాన్ని ధ్వనిస్తుంటాయి. అయితే అది రిసీవ్ చేసుకునే విధాన్ని బట్టి కూడా ఉంటుందనేది వేరే విషయం. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓ సీనియర్ పోలీసు అధికారిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ హాట్ గా మారడమే ఇందుకు కారణం. ఏపీ సర్కార్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏబీ సస్పెన్షన్ పై కాస్త సానుభూతి వ్యాఖ్యలు చేస్తుండగా, అదే పార్టీకి చెందిన కేశినేని నాని ఇందుకు విరుద్ధంగా ట్వీట్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. వైఎస్ జగన్ ను ఉద్ధేశిస్తూ, ‘మీరు ముఖ్యమంత్రి కావడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే… సస్పెండ్ చేశారేంటి?’ అని కేశినేని ట్విట్టర్లో స్పందించడం గమనార్హం.
కేశినేని నాని ఇలా స్పందించడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలే కారణమని కేశినేని డైరెక్ట్ గానే నిందించినట్లా? అని కొందరు వ్యాఖ్యనిస్తుండగా, ట్వీట్ వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు, కేశినేని నానిల మధ్య గతంలో అనేక వివాదాలు ఉన్నాయని, ఓ భూ వివాదంలో ఇద్దరి మధ్య దాదాపు యుద్ధమే జరిగిందనేది ప్రచారపు సారాంశం. అప్పటి పాత వివాదపు అంశాల నేపథ్యంలోనే కేశినేని నాని ఏబీ వెంకటేశ్వరరావుపై లోలోన గల తన కసిని ఇలా ట్వీట్ల రూపంలో పరోక్షంగా తీర్చుకున్నారని విజయవాడ వీధుల్లో లోకం కోడై కూస్తున్నదట.
అయితే కేశినేని నాని ట్వీట్ కు ఏబీ వెంకటేశ్వరరావు గట్టి కౌంటర్ ఇస్తూ రీట్వీట్ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ, మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబుగారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు అని ఓ ట్వీట్ చేశారు. అనంతరం ‘మరి మీరు మీరు పార్లమెంట్ లో కలిసి మెలిసే ఉంటారుగా! అందరూ కలిసి ఓ అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో, లేక మరేమైనా చేశానో, నాక్కూడా కొంచెం క్లారిటీ వస్తుంది’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ ద్వారానే కౌంటర్ ఇవ్వడం గమనార్హం.