ఆంధ్రప్రదేశ్ లోని ‘కియా’ మోటార్స్ తరలింపు వార్తా కథనాల ప్రకంపనల్లో ఇది మరో కోణం. ఏపీ నుంచి కియా కార్ల ఉత్పత్తి కంపెనీ తమిళనాడుకు తరలిపోతోందని, తమ రాష్ట్రానికి రావాలని పంజాబ్ ఆహ్వానిస్తోందని వెలువడిన వార్తా కథనాలపై జగన్ సర్కార్ భగ్గుమన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వెలువరించిన ఈ కథనంపై అనేక పత్రికలు, ప్రసార మాధ్యమాలు పుంఖాను పుంఖాలుగా వార్తలను ప్రచురించాయి. దీంతో జగన్ సర్కార్ ఆఘమేహాల మీద దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. చివరికి పార్లమెంట్ లోనూ కియా కార్ల కంపెనీ తరలింపునకు సంబంధించిన ప్రస్తావనకు రాయిటర్స్ సంస్థ వార్తా కథనం దారి తీసింది.
రాయిటర్స్ వెలువరించిన వార్తా కథనాన్ని ప్రామాణికంగా చేసుకుని ‘ఎల్లో మీడియా’గా ప్రాచుర్యంలో గల పత్రికలైతే బ్యానర్ స్టోరీలను ప్రచురించాయి. ఏపీ సీఎం జగన్ కు చెందిన సాక్షి మీడియా గ్రూపు దీన్ని తిప్పికొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే కియా మోటార్స్ కార్ల కంపెనీ తరలింపు విషయంలో వెలువరించిన వార్తా కథనానికి సంబంధించి ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తన తప్పును దిద్దుకుందనే వార్తలు సైతం శనివారం వెలువడ్డాయి. కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందంటూ గతంలో చేసిన ట్వీట్ ను డిలీట్ చేస్తున్నట్లు మరో ట్వీట్ ప్రత్యక్షమైన పరిస్థితుల్లో ఆయా వార్తా కథనాలు వెలువడ్డాయి. జగన్ సర్కార్ కు బాసటగా నిలిచే ‘సాక్షి’ మీడియాకు చెందిన వెబ్ సైట్ కూడా ‘కియా మోటార్స్: తప్పు సవరించుకున్న రాయిటర్స్’ శీర్షికన ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. సాక్షి టీవీలోనూ ఈమేరకు వార్తా కథనాన్ని ప్రసారం చేశారు. సాక్షి మీడియా గ్రూప్ యాప్ లోనూ ఇదే వార్తను అప్ లోడ్ చేశారు.
అయితే ప్రభుత్వ ప్రతిష్టగా భావించిన కియా మోటార్స్ తరలింపునకు సంబంధించి రాయిటర్స్ వార్తా సంస్థ తన తప్పును సవరించుకుని ట్వీట్ ను డిలీట్ చేసిన సంచలన పరిణామాల్లో మరుసటి రోజు సాక్షి మీడియా గ్రూప్ ఎలా స్పందించాలి? సర్కార్ ఇమేజ్ ను మరింత పెంచే దిశగా ఓ బ్యానర్ స్టోరీ ప్రచురించాలి. రాయిటర్స్ ట్వీట్ ను కూడా బ్లాస్ట్ చేయాలి. కానీ ఇవేవీ జరగకపోవడమే ఆశ్యర్యకర పరిణామం. కనీసం సాక్షి పత్రికలో అందుకు సంబంధించి ఓ ‘ఫిల్లర్’ ( పత్రిక పేజీలో ఎటూ కాకుండా మిగిలిన ఓ ఖాళీ జాగా నింపే ప్రదేశం) వార్త కూడా కనిపించకపోవడమే మరో సంచలనం. అంతేకాదు ‘సాక్షి’ వెబ్ సైట్లోనూ నిన్నటి వార్తా కథనపు వివరాలు కనిపించడం లేదు. సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్త క్లిప్ వీడియో వెబ్ సైట్లో ప్లే కావడం లేదు. సాక్షి యాప్ లోనూ ఈ వార్తకు సంబంధించి ఇదే పరిస్థితి.
కియా మోటార్స్ విషయంలో రాయిటర్స్ సంస్థ తప్పును సవరించుకుంటే సదరు వార్తను ‘సాక్షి’ ఆదివారంనాటి సంచికలో ఎందుకు పట్టించుకోలేదన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంటే రాయిటర్స్ ట్వీట్ ఒరిజినల్ కాదా? ఎవరైనా నకిలీ ఖాతాను క్రియేట్ చేసి ట్వీటారా? ఇదే జరిగిదే ‘ఎల్లో మీడియా’ కూడా ఎందుకు ఆ విషయంపై మిన్నకుంది. అంతా అయోమయం… అనుమానాస్పదం. నిజా నిజాలు నిలకడగానే తెలుస్తాయంటారు. ఇది కూడా అంతే కాబోలు.